కాటి కాపరి ఏడుపు

కాటి కాపరి రోజూ… చావులను చూస్తూనే ఉంటాడు. కాబట్టి అతడు చలించడంగానీ, బిగ్గరగా దుఃఖించడంగానీ ఉండదని ఒక అభిప్రాయం ఉంది. జనన మరణాలకు అతీతంగా ఏ భావానికీ చలించకుండా అతని మనసు స్థిరంగా ఉంటుంది. మరి అలాంటి ఒక కాటికాపరి ఒక రోజూ ఏడుస్తూ కనిపించాడట. విషయం ఏమిటని ఆరా తీస్తే… ‘‘ఈరోజు ఒక్క శవమూ రాలేదు’’ అన్నాడట. శవం రాకపోతే సంతోషించాలిగానీ, ఏడ్వడం ఎందుకు? అనే సందేహం వస్తుంది. అయితే మరో కోణంలో చూస్తే మాత్రం… శవసంస్కారంతోనే కాటికాపరి ఉపాధి ముడిపడి ఉంది.

శవం రాకపోతే… ఆరోజు అతడు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఎవరి బాధ వారిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే…ఎవరైనా లోకనీతి గురించి ఆలోచించకుండా తన స్వప్రయోజనాల కోసం బాధపడితే… అలాంటి వారిని ఉద్దేశించి ‘కాటి కాపరి ఏడుపు ఏడుస్తున్నాడు’ అని అంటారు.

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి

Leave a Comment