రాష్ట్ర విభజనతో నాటక రంగంలో సరికొత్త పోకడలు..!

తెలుగు నాటకరంగంలో రాష్ట్ర విభజన సరికొత్త పోకడలకు తెరతీసింది. తెలుగు నాటక దినోత్సవంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పండుగగా జరుపుకునే ఏప్రిల్‌ 16 ఇప్పుడు హైదరాబాద్‌లో పండుగ వాతావరణమే లేకుండా పోయింది. తొట్టతొలితెలుగు రంగస్థల ప్రదర్శనకు తెరతీసిన కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నగరంలో అనామకం అయిపోయింది. గతంలో వేలాది మంది ఉత్సాహంగా ఊరేగింపులు తీసి సంబరాలు చేసుకున్న తెలుగురంగ స్థల దినోత్సవం ఈ ఏడాది నగరంలో వెలవెలబోతుంది. ఆదివారం సెలవు కలసిరావడంతో అలనాటి స్టేట్‌ ఫెస్టివల్‌ ఈ రోజు పాతజ్ఞాపకంగా మిగిలిపోయింది. 2000లో నాటకరంగ కళలో డాక్టరేట్లు, ఎంఫిల్‌లు, ఎంఏ డిగ్రీలు పొందిన యువత కలసి యవనిక పేరుతో తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని మహాసంబరంగా నిర్వహించారు. తెలుగునాటకరంగంలో నిష్ణాతులంతా కలసి ఆ యువకుల్ని ఆశీర్వదిస్తూ రకరకాల సూచనలు పథకాలతో రాష్ట్రంలోని నాటకాలవాళ్లంతా పద్యాలు నాటకాలతో ఎక్కడికక్కడ ఉత్సవాలను ఘనంగా జరిపే ఆనవాయితీకి నాంది పలికారు. హైదరాబాద్‌ నుంచి పల్లెలదాకా జేజేలతో స్పందిచారు. నాటకరంగంపై మక్కువ గల అధికారుల్లో ముందుగా అందరూ చెప్పుకునే కేవీ.రమణ నాటకాలవారినందరినీ సమావేశపరిచి నాటకరంగ దినోత్సవానికి ఏప్రిల్‌ 16ను ఖరారు చేసి 2006లో ఉత్తర్వులు జారీ చేయించారు. హైదరాబాద్‌లో పాలపొంగులా పొంగిన ఉత్సాహం ఉల్లాసం ఈ ఏడాదిలో 13 జిల్లాల అధికారుల మొక్కుబడి ఆలోచనలతో పేలవంగా జరుగుతున్నాయి. అసలుసిసలు నాటకరాజధానిలో ఎవరికి పుట్టినబిడ్డో వెక్కివెక్కి ఏడుస్తోందన్న చందంగా నాటకరంగ దినోత్సవం అక్కున పొదువుకునే వారు లేని అనాథసంబరం అయింది. వందలమంది కళాకారులు అభిమానులు కలసి రవీంద్రభారతి నుంచి ఊరేగింపుగా తరలి కందుకూరి వీరేశలింగం, జయంతి, బళ్లారి రాఘవ వర్దంతి గురజాడ సంస్మరణలతో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలకు పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించే సన్నివేశం శాశ్వతంగా లేకుండాపోయింది. నాటకాల మనుగడను కొత్తమలుపు తిప్పేలా తెలంగాణ కళాకారులు తమ సృజనతో ముందున్నారు. ఒక్కో నాటకం ఒక్కో ప్రక్రియతో రంగస్థల కళ వికాసంలో విశిష్ఠ అధ్యాయాలుగా తెలుగునాటక చరిత్రలో చోటు చేసుకుంటున్నాయి. ప్రేక్షకులకు తాజాగా తియతీయని అనుభవాలు అనుభూతుల్ని పంచుతున్నాయి. వాటిల్లో కొన్ని వన్నెలు మన్ననలు పొందుతున్న తీరుతెన్నులు…
సంఘం శరణం గచ్చామి…
ప్రజాకళారూపాలతో పల్లెపల్లెలో ప్రదర్శనలు శాఖలు గల ప్రజానాట్యమండలి వారు అంబేద్కర్‌ ఆలోచనలు సిద్ధాంతాలను అందరికీ అలవోకగా అవగతమయ్యేలా 70 నిమిషాల తాజా నృత్యనాటకాన్ని వేదికపైకి తెచ్చారు. తెలంగాణలోని జిల్లాల నుంచి 20 మంది మెరికల్లాంటి కళాకారులతో రూ.25లక్షలతో, ప్రజానాట్యమండలి తమ ప్రత్యేకత చాటిచెప్పేలా తొలి ప్రదర్శనతోనే జేజేలు అందుకున్నారు. ప్రత్యేకమైన ఏర్పాట్లు వసతులు హంగులకోసం ఆరాటం అవుసరంలేకుండా సులువుగా శక్తివంతమైన సందేశాన్ని అసలైన జనచైతన్య సందేశాన్ని అందిస్తామని వివరించారు. ఒక్క ఫోన్‌కాల్‌తో ఆహ్వానిస్తేచాలు మీ ముంగిలిలో మా బృందం ప్రదర్శన ఉంటాయని ప్రజానాట్యమండలి కార్యదర్శి దేవేందర్‌ ప్రకటించారు. దేశవిదేశాల్లో తమ నాటకాలతో మొప్పుపొందిన రంగస్థలకళ ప్రవీణులు డాక్టరేట్‌ డిగ్రీలు పొందినవారు తమ ప్రతిభతో సంఘం శరణం గచ్చామికి రూపకల్పన చేసారు.
నాయకురాలు నాగమ్మ…
తెలంగాణలో పుట్టిపెరిగి పల్నాడు లో మహామంత్రిగా తన ధీశక్తి శౌర్యపరాక్రమాలతో బ్రహ్మనాయుడు వంటి మేధావికి కష్టాలు అవమానాలు పెంచి జై కొట్టించుకున్న నాయకురాలు నాగమ్మ ప్రదర్శన హైదరాబాద్‌లో పుట్టింది. సంచలనాత్మక ఆదరణతో ఆహ్వానాలు పెంచుకొంటుంది. కరీంనగర్‌ జిల్లా ఆరవల్లి ఆలయంలో పూజలందునే పల్నాటి నాగమ్మ చరిత్రను గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైహెచ్‌కే.మోహనరావు రచించారు. ఉగాది వేడుకల్లో ఆంధ్ర ప్రభుత్వ సత్కారాన్ని అందుకున్న ఆయన కృషిని హైదరాబాదీ కళాకారులు గుర్తించి ఆదరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమనాటక రచయితగా బహుమతి పొందిన నారాయణబాబు చరిత్రను నాటకీకరించారు. సంగీతం యుద్ధకళలు అత్యాధునిక నాటక పోకడలతో అన్ని తరహాల ప్రేక్షకులకు అనువుగా ఆ నాటకం రూపొందిందని ప్రశంసలు అందుకుంటోంది. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా విశాఖపట్నం కళాభారతి ఆహ్వానంతో పాటు తెలంగాణలో పలుజిల్లాల నుంచి ఆ ప్రదర్శనకు ఆహ్వానాలు అందుతున్నాయి.
ఆకాశవాణిలో రసవత్తర రంగస్థల వాణి…

16 నుంచి 22 వరకు ఉదయం 9.30 నుంచి 60 నిమిషాలసేపు 7 నాటకాలు ప్రసారం కాబోతున్నాయి. హైదరాబాద్‌లోని నాటకరంగప్రముఖులు రూపొందించిన శ్రీనాథుడు, తర్వాత ‘ఒకే నిద్ర – ఎన్నో కలలు’ ఓ కాశీవాసా రావయ్యా, జగమేమారినది, ఆదిలాబాద్‌ శాలువా, ఇదిగో తోక – అదిగో పులి, బైపాస్‌ వరుసగా ఆలకించొచ్చు.

 

Leave a Comment