‘ఆయన జోలికి వెళ్లకు. గౌతముడి గోవులాంటోడు… ఇబ్బందుల్లో పడతావు’ అంటుంటారు. కొందరు చాలా సున్నిత మనస్కులు ఉంటారు. వారితో వ్యవహరించడంలో ఏ మాత్రం తేడా వచ్చినా… అవతలి వ్యక్తి ఇబ్బందుల్లో పడతాడు. విషయం ఎక్కడికో వెళ్లిపోతుంది. పురాణాల్లో గౌతముడు అనే మహర్షికి సంబంధించిన కథ ఇది. పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఒక మాయధేనువు వచ్చింది. గోవు పవిత్రమైనది కాబట్టి దానికి ఏ ఇబ్బందీ కలగకుండా గడ్డిపరకతో సున్నితంగా అదిలించాడు గౌతముడు. ఈమాత్రం దానికే ఆ గోవు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకుంది. ఈ పురాణ కథ నుంచే ‘గౌతముడి గోవు’ అనే మాట పుట్టింది, అకారణంగా, ఉత్తపుణ్యానికి ఇబ్బందుల్లో పడినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి