జాతీయాలకు తెలుగు భాష పెట్టింది పేరు. మన భాషలో ఉన్నన్ని జాతీయాలు ఏ ఇతర భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు . ఎదుటివారి మనసు చివుక్కుమనకుండా అంటే “కర్ర విరగా కూడదు .. పాము చావాకూడదు” అన్నట్లుగా చెప్పే ఈ జాతీయాలను గత కొంతకాలం నుంచి ప్రతీ ఆదివారం సాక్షి ఫన్ డే ఎడిషన్ లో మనకు అందిస్తూ ఉంది . ఈ ప్రయత్నం చాలా మెచ్చుకోదగినది. తెలుగు భాషా పునరుద్దరణలో ఇది చాలా మంచి కార్యక్రమం .
సాక్షి యొక్క పాత సంచికలు దొరకడం కష్టం కనుక ఆయా సంచికల్లో వచ్చిన ఈ జాతీయాలను సాక్షి నుంచి సేకరించి మీకు అందిచడం ఆనందంగా ఉన్నా ఇలా కాపీ కొట్టినందుకు సాక్షివారికి క్షమాపణలతో …
శోధిని
జైనుడి చేతిలో పేను!
జైన మతం అహింసకు పెద్దపీట వేస్తుంది. సూక్ష్మజీవులు చనిపోతాయని నీళ్లు వడగట్టుకొని తాగుతారు, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాళ్ల కింద సూక్ష్మజీవులు చనిపోతాయని నెమలీకలతో నడిచినంత మేరా నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను దున్ని చేసే వ్యవసాయం చేయరు. జైనుల అహింసా సిద్ధాంతం ఆచరణసాధ్యం కానంత తీవ్రస్థాయిలో ఉంటుందనే విమర్శ కూడా లేకపోలేదు.
వెనకటికి ఒక జైనుడి తలలో పేలు పడ్డాయి.
అందులో ఒకటి అతడికి చిక్కింది.
దాన్ని చేతిలోకి తీసుకున్నాడేగానీ ఏం చేయాలో అర్థం కాలేదు.
చంపకుంటే మనసు శాంతించదు.
చంపితే మతధర్మం ఒప్పుకోదు.
‘చంపడమా? వదిలిపెట్టడమా?’ అనే సంఘర్షణలో జైనుడితో పాటు ఆ పేను కూడా నరకం అనుభవించింది. ఈ కథ సంగతి ఎలా ఉన్నా…ఒక విషయం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నప్పుడు లేదా ఒక అవకాశం చేతికి చిక్కినప్పటికీ ఏమీ చేయలేని స్థితి ఎదురైనప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
రోకలి చిగుళ్లు!
‘రోకలికి చిగుళ్లు కోయవద్దు. జరిగే పనేనా కాదా అనేది చెప్పు’
‘నువ్వు చెప్పిన పని పొరపాటున కూడా సాధ్యం కాదు. రోకలికి చిగుళ్లు మొలుస్తాయా?’ ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం.
చెట్టునో, కొమ్మనో నరికి ఎండబెట్టి రోకలిగా చెక్కుతారు. ఇక అలాంటి రోకలి చిగుళ్లు వేయడం అనేది అసంభవం అనే విషయం అందరికీ తెలుసు. అసాధ్యం, అసంభవం అనుకునే పనుల విషయంలో ఉపయోగించే మాట ఇది!
జాపరమేశ్వరా!
ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
ఆపదలో ఉన్న వ్యక్తి… ‘‘దేవుడా కాపాడు’’ అని అంటూ పరుగెత్తుతాడు. దీనికి సమానమైనదే ఈ జాపరమేశ్వరా!
‘తన ఇబ్బంది గ్రహించి జాపరమేశ్వర అని పారిపోయాడు’ ‘జాపరమేశ్వర అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’ ఇలాంటి మాటలు వింటుంటాం.
జా, పరమేశ్వరా పదాలతో ఏర్పడినదే జాపరమేశ్వర! ‘జా’ అంటే హిందీలో ‘వెళ్లు’ అని అర్థం. ‘పరమేశ్వరా’ అనేది ఇష్టదైవాన్ని తలుచుకోవడం.
నందో రాజా భవిష్యతి!
‘‘నువ్వు చెప్పిన విషయం వింటుంటే ఆందోళనగా ఉందోయ్.’’
‘‘ఇప్పుడే ఆందోళన పడడం ఎందుకు? నందో రాజా భవిష్యతి… భవిష్యత్‌లో ఏం జరగనుందో ఎవరు చెప్పొచ్చారు?’’
‘భవిష్యత్‌లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
దీని వెనక కథ ఇది:
ఉత్తుంగభుజుడు అనే రాజు కుమారుడు నందుడు. ఉత్తుంగభుజుడు చెడు వ్యసనాలకు లోనై ఒక వేశ్య మాయలో పడిపోతాడు. రాణిని, కుమారుడు నందుడిని చిన్న చూపు చూస్తాడు. రాజులో వచ్చిన మార్పుకు ప్రజలు ఆందోళన పడతారు.
‘‘పాపం… ఆ కుర్రాడి భవిష్యత్ తలచుకుంటే బాధగా ఉంది. ఆ మహాతల్లి యువరాజా వారిని ఏం చేస్తుందో ఏమో’’ అని ఒకరంటే…
‘‘యువరాజా వారి భవిష్యత్ గురించి ఇప్పుడు ఆందోళన చెందడం ఎందుకు? కాలం ఎప్పుడూ ఒకే తీరులో ఉండదు. రాజావారు చెడు వ్యసనాల నుంచి బయటపడవచ్చు. ఎప్పటిలాగే రాణిని, కుమారుడిని ప్రేమగా చూసుకోవచ్చు’’ అని ఒకరు ఆశావహదృక్పథంతో అనేవారు. నందుడి భవిష్యత్ గురించి ఆలోచన, ఆందోళన కాస్తా నందో రాజా భవిష్యతి అయ్యింది!
జిల్లేడు పెళ్లి!
‘‘అదో పెళ్లంటావా? ఉత్త జిల్లేడు పెళ్లి.’’
‘‘నువ్వు చేసుకుంది పెళ్లి కాదు జిల్లేడు పెళ్లి’’… ఇలాంటి మాటలు అసహనంతోనో, ఆగ్రహంతోనో వినిపిస్తుంటాయి.
ఉత్తుత్తి పెళ్లి, దొంగపెళ్లి, ఎవరూ గుర్తించని పెళ్లిని జిల్లేడు పెళ్లి అంటారు. అసలీ మాట ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే…
పూర్వం ఇద్దరు భార్యలు చనిపోయిన వ్యక్తి మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనికి మొదట జిల్లేడు పెళ్లి చేసేవారు. అంటే… ‘మూడు’ అనేది అంత మంచిది కాదన్న ఉద్దేశంతో జిల్లేడు చెట్టుకు తాళి కట్టించేవారు. దీంతో వరుడు చేసుకునే మూడో పెళ్లి కాస్త… నాలుగో పెళ్లి అయ్యేది. ఈ వ్యవహారం నుంచి పుట్టిందే… జిల్లేడు పెళ్లి!
గ్రంథసాంగుడు!
గ్రంథసాంగుడుకు నిజమైన అర్థం ఒక పుస్తకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు అని.
గ్రంథం అంటే పుస్తకం. సాంగం అంటే… భాగాలతో కూడిన అని అర్థం.
ఒక పుస్తకంలో భిన్నమైన భాగాలన్నింటినీ అధ్యయనం చేసినవాడు గ్రంథసాంగుడు.
అయితే వ్యవహారికంలో గ్రంథ అధ్యయనంలో నిష్ణాతుడు అని కాకుండా… మోసం, రసికత్వం మొదలైన వాటిలో ఆరితేరిన వారిని ‘గ్రంథ సాంగుడు’ అనడం మొదలైంది.
తాపత్రయం
‘‘ఇంత తాపత్రయం’’ అవసరమా?
‘‘ఈయన తాపత్రయానికి అంతు లేదు’’… ఇలా తాపత్రయం అన్న పదాన్ని నిత్యజీవితంలో పదే పదే వింటూ ఉంటాం. అసలీ పదానికి అర్థం ఏమిటో తెలుసా?
‘అధిక ఆశ’, ‘అధికమైన ఆరాటం’ అనే అర్థాలతో ఈ మాటను వాడుతున్నప్పటికీ… నిజానికి తాపత్రయం అంటే లేని బాధలను కొనితెచ్చిపెట్టుకొని బాధపడడం.
ఈ తాపత్రయంలో మూడు రకాలు ఉంటాయి.
తన శరీరానికి కలిగిన బాధను తలచుకొని బాధ పడడం… ఆధ్యాత్మిక తాపం.
తన కుటుంబానికి, స్నేహితులకు వచ్చిన కష్టాలను తలచుకొని బాధపడడం… అధి భౌతిక తాపం.
ప్రకృతి వైపరీత్యాలను తలచుకొని బాధపడడం అధిదైవిక తాపం.
ఈ మూడు తాపత్రయాల గురించి ఆలోచిస్తూ విచారపడడాన్ని తాపత్రయ పడడం అంటారు. బాధలు కాని వాటిని బాధలుగా అనుకుని బాధపడడం అన్నమాట.
నోరు బెల్లంగాళ్లు!
కొందరు తమ పనులు చక్కబెట్టుకోవడానికి, తాము కోరుకున్నది దక్కించుకోడానికి ఎదుటి వాళ్లతో తీయగా మాట్లాడతారు. ఎప్పుడైతే పని పూర్తవుతుందో ఇక అప్పటి నుంచి కంటికి కూడా కనిపించరు! మాటల్లో ‘ఆకర్షణ’ ఉండి చేతల్లో శూన్యం, అవకాశవాదం కనిపించేవారి విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
ఊరు ఉసిరికాయంత… తగాదా తాటికాయంత!
పరిమాణం, ఆకారం, ఎత్తు… ఇలాంటి కొన్నిటి ఆధారంగా కొన్ని విషయాల్లో ఒక నిర్ణయానికి రాలేం.
పూర్వం ఒక రాజ్యంలో చిన్న గ్రామం ఉండేదట. సాధారణంగా చిన్న ఊళ్లలో జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ చిన్న ఊళ్లో అడుగుపెట్టిన ఒక కొత్తాయనకు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా అరుపులు, కేకలు వినిపించాయట. ‘విషయమేమిటి?’ అని ఆరా తీస్తే ఎవరో చెప్పారట…
‘ఊరు ఉసిరికాయంత… తగాదా తాటికాయంత’ అని. అలా ఎందుకు అన్నాడంటే… ఆ ఊళ్లోవాళ్లకు అట్టే పని లేకపోవడంతో, కాలక్షేపం కోసం చిన్న చిన్న విషయాలపై రోజంతా తగాదా పడేవాళ్లట!
అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోనికి వచ్చింది. ప్రాధాన్యత లేని అంశాలపై తగాగా పడేవాళ్ల విషయంలో, చూడడానికి ఒక రకంగా చేతల్లో మరోకరంగా కనిపించే సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం మొదలైంది.
మిడతంభొట్లు శకునం!
కొందరు పాండిత్యం లేకపోయినా అదృష్టవశాత్తూ పండితులుగా చలామణీ అవుతుంటారు. పూర్వం ఒకాయనను ఎవరో- ‘‘నా గుప్పెట్లో ఏముంది చెప్పండి?’’ అని అడిగాడట.
‘‘ ఆ… ఏముంటుంది? మిడత తప్ప’’ అని నోటికి వచ్చింది అన్నాడట.
చిత్రమేమిటంటే, ఆ వ్యక్తి గుప్పెట్లో నిజంగానే మిడత ఉంది. దాంతో ఆ మిడతాయన ఎగిరి గంతేసి-
‘‘మీ అంతటి గొప్ప జ్యోతిష్యుణ్ని నేను ఇప్పటి వరకు చూడలేదు’’ అన్నాడట. అనడమేమిటి? ఊరంతా టాంటాం చేశాడట. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి ‘మిడతంభొట్లు’ పేరుతో గొప్ప జ్యోతిష్యుడిగా చలామణీ అయ్యాడట. జ్యోతిష్యులకు పుట్టుమచ్చశాస్త్రం, జాతకచక్రాలు… ఇలా రకరకాల అంశాలపై పట్టు ఉండాలి. అలాంటివేం లేక పోయినా జ్యోతిష్యం చెబు తుంటారు కొందరు. యాదృచ్ఛికంగానో, అదృష్టవశాత్తో వారు చెప్పిన జోస్యం నిజమై కూర్చుంటుంది. ఇలాంటి సంద ర్భాల్లో ఉపయో గించే జాతీయం మిడతంభొట్లు శకునం!
ఆహా…అప్పు లేని గంజి!
మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. మొదటి కోవకు చెందిన వాళ్లు… ఉన్నంతలో సర్దుకు పోతారు. ఆడంబరాలకు పోరు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. తమ స్థాయికి మించిన పనులు ఎప్పుడూ చేయరు. రెండో కోవకు చెందినవాళ్లు… ఉన్నంతలో పొరపాటున కూడా సర్దుకుపోరు. ‘స్థాయి’తో పనిలేకుండా ఆడంబరాలకు పోయి అష్టకష్టాలు పడుతుంటారు. మరోవైపు చూస్తే, ఆడంబరాలకు పోనివాళ్లు, తమ స్థాయి గురించి స్పృహ ఉన్నవాళ్లు మాత్రం ఎలాంటి టెన్షన్, కష్టాలు లేకుండా హాయిగా ఉంటారు.
అప్పు చేసి పంచభక్ష్య పరమాన్నాలు భుజించేవారికి అందులో రుచి తెలియదు. చేసిన అప్పే గుర్తుకు వస్తుంటుంది. తమ స్థోమతకు తగినట్లు గంజి తాగేవాళ్లకు మాత్రం ఎలాంటి ముందస్తు భయాలూ ఉండవు. గంజైనా సరే… ఆ రుచిని హాయిగా ఆస్వాదిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ‘అప్పు లేని గంజి అమృతంతో సమానం’ అనే జాతీయాన్ని వాడుతారు.
పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం!
అన్ని సందర్భాలకూ ఒకే రకమైన పరిష్కారాన్ని ఆలోచించే వ్యక్తుల విషయంలో ఉపయోగించే మాట ఇది. మంత్రం అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్థం. అంత మాత్రాన ఒకే మంత్రం అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు. అన్ని సందర్భాలకూ సరిపోదు. ఉదాహరణకు పెళ్లి విషయాన్నే తీసుకుందాం. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో చదివే మంత్రం వేరు, మాంగల్య ధారణ సమయంలో చదివే మంత్రం వేరు. రెండు సందర్భాల్లోనూ ఒకే మంత్రం ఎలా చదువుతారు!
అలాగే అధిదైవికం… వరదలు, భూకంపాలు, పిడుగులు మొదలైన ప్రమాదాలు జరిగినప్పుడు మూడుసార్లు శాంతి అని పలుకుతారు. పిడుగు పడినప్పుడు ‘అర్జునా… ఫల్గుణా…’ మంత్రం జపించడం కూడా చూస్తుంటాం. పురోహితులు బియ్యం వంటివి దానం తీసుకునేటప్పుడు స్వస్తి మంత్రం చదువుతూ ఆశీస్సులు పలుకుతారు. అయితే పిడుగు పడినప్పుడూ బియ్యం తీసుకున్నప్పుడూ ఒకే మంత్రం జపిస్తే ఎలా ఉంటుంది? చాలా అసంబద్దంగా ఉంటుంది కదా! అదే విధంగా సమస్య ఏదైనా ఒకలాగే పరిష్కరిద్దామని చూడకూడదు అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం.
తానా అంటే తందానా!
సంగీతం, నృత్యం, నాటకం…ఈ మూడింటి మేలు కలయిక బుర్రకథ. ఇందులో ముగ్గురు ప్రదర్శకులు ఉంటారు. ప్రధాన కథకుడు కథ చెబుతుంటే కుడి, ఎడమ వైపు ఉన్నవారు ‘తందాన తాన’ అని వంత పాడతారు. అందుకే దీన్ని తందాన కథ అని కూడా అంటారు. నిజానికి అతను చెప్పే కథ వాళ్లు వింటారో లేదో కూడా తెలీదు. అతని మాట పూర్తవగానే తందాన తాన అనేస్తారు. సమాజంలో కూడా కొందరు ఎదుటివాళ్లు చెప్పేదాన్ని గుడ్డిగా సమర్థించేస్తారు. ఇలా సొంత అభిప్రాయమనేది లేకుండా పక్షపాతంతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విషయంలో ఈ మాటను వాడుతుంటారు.
హంసగానం!
హంసల అందచందాల గురించి పురాణాల్లో గొప్పగా వర్ణించారు. ఇవి ఆకాశగంగలో బంగారు తామరలు తింటూ విహరిస్తాయట. నల దమయంతుల వివాహానికి హంస చేసిన రాయబారం గురించి కూడా కవులు అందంగా వర్ణించారు. అందచందాలు, ప్రతిభ ఉన్నప్పటికీ హంస ఎప్పుడూ పాడదట. ఒకవేళ పాడితే… అది చని పోయే ముందేనట! దీంతో ‘చావు’ అనేదానికి ‘హంసగానం’ అనేది ప్రత్యామ్నాయం అయింది.
చనిపోయిన తరువాత ‘ఆత్మ’ అనేది… హంస పాడే పాట రూపంలో పరమాత్మలో ఐక్యమై పోతుందనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక విశ్వాసం. అందుకే చనిపోయారు అని చెప్పడానికి ‘హంస లేచింది’ ‘హంసగానం’ అనే మాటలను వాడుతుంటారు.
కెరటాల కరణం!
లంచాలు తీసుకోవడంలో ఆరి తేరిన అధికారుల విషయంలో వాడే జాతీయం ఇది. ‘‘ఆ ఆఫీసర్ అచ్చంగా కెరటాల కరణం’’ అంటుంటారు. ఈ జాతీయం వెనుక ఒక కథ ఉంది: బ్రిటిష్ రాజ్యంలో ఒక కరణం లంచాల కోసం ప్రజలను తెగ పీడించేవాడట. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చి శిక్షగా ‘ఈ కరణాన్ని ఏదైనా ద్వీపంలో పడేయండి’ అని ఆదేశించింది. అలా అండమాన్ చేరుకున్న కరణంగారు బాధపడుతూనో, పశ్చాత్తాప పడుతూనో కాలం వెళ్లబుచ్చలేదు.
సముద్రం ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని తెల్లకాగితాల్లో లెక్కలు రాసేవాడట. ‘ఈ రోజు వచ్చిన అలల సంఖ్య… పెద్ద అలల సంఖ్య… చిన్న అలల సంఖ్య… ఒడ్డు వరకూ చేరని అలల సంఖ్య’… ఇలా లెక్కలు రాస్తూ కూర్చునేవాడట. ఒక రోజు ఒక పెద్ద ఓడ ఈయనకు సమీపంలోనే లంగరు వేసింది. కరణం ఆ ఓడ కెప్టెన్‌ను పిలిచి ‘‘ఈ సముద్రం నీ బాబుగాడిది అనుకున్నావా?
ఎవరి అనుమతి తీసుకొని ప్రయాణిస్తున్నావు? ఈ విషయం విక్టోరియా రాణిగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నీ ఓడ వల్ల ఎన్ని అలలు వచ్చాయో లెక్క కూడా వేశాను’’… ఇలా ఉపన్యాసం దంచి జరిమానా కింద ఆ ఓడ కెప్టెన్ నుంచి డబ్బులు రాబట్టాడట. విషయం ప్రభుత్వానికి తెలిసి ‘ ద్వీపాం తరవాసంలోనూ వీడి బుద్ది మార లేదన్నమాట’ అని తలపట్టుకుందట!
అనామకంగా!
‘నిన్నా మొన్నటి వరకు అనామకంగా ఉన్న వ్యక్తి కాస్తా ఇప్పుడు ప్రముఖుడయ్యాడు’
‘పాపం… అతడి జీవితం అనామకంగా ముగిసింది’… ఇలాంటి మాటలను వింటుంటాం. అసలేమిటీ అనామకం?
పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఎవరి దృష్టీ సోకని వ్యక్తులు, ప్రదేశాల విషయంలో ‘అనామకం’ మాటను వాడుతుంటారు. ఈ అనామకం వెనుక ఒక పురాణకథ ఉంది. బ్రహ్మదేవుడికి ఒకప్పుడు అయిదు తలలు ఉండేవట. ఒకసారి ఆయనకి, శివుడికి మధ్య యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో శివుడు తన ఉంగరపు వేలి గోరుతో శివుడి అయిదవ తలను సంహరించాడు. ఉంగరపు వేలును సంస్కృతంలో అనామిక అంటారు. ఏ వేలుతో అయితే శివుడు బ్రహ్మదేవుడి తలను సంహరించాడో, ఆ వేలును వేదకర్మలలో ఉపయోగించకూడదని, ఉచ్చరించకూడదనే నియమం ఏర్పడింది. ఈ అనామిక నుంచే అనామకం అనే జాతీయం పుట్టింది.
బాదరబందీ!
పూర్వపు రోజుల్లో రాజుల దగ్గర పని చేసే ఉన్నతోద్యోగులు పొడవాటి అంగరఖా ధరించేవారు. అంగరఖా కుడి, ఎడమ అంచులను చిన్న చిన్న దారాలతో ముడివేసేవాళ్లు. అవి మొత్తం పన్నెండు ఉండేవి. రోజూ ఈ పన్నెండు ముళ్లనూ వేయడమనేది సహనానికి పరీక్షలా ఉండేది. అలా అని కుదరదు అనడానికి లేదు. చచ్చినట్లు వాటిని కట్టుకొని కొలువుకు వెళ్లాల్సిందే.
హిందీలో పన్నెండును బారా అంటారు. బారా, బాధ… ఈ రెండూ కలిసి ‘బాదర’గా రూపుదిద్దుకుంది. దీనికి చివర ‘బందీ’ కూడా చేరిపోయింది. చికాకు పుట్టించి, సమస్యగా తోచే వ్యవహారాలు, భారంగా తోచే అనివార్య బాధ్యతల విషయంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘అతడికి ఎలాంటి బాదరబందీ లేదు. హాయిగా కాలం గడుపుతున్నాడు’… ‘నీకేం ఎన్నయినా చెబుతావు. మాలా బాదరబందీ ఉంటే అర్థమవుతుంది’… ఇలా అన్నమాట!
కబంధ హస్తాలు!
ఎవరైనా చెడ్డవ్యక్తుల బారిన పడినప్పుడు- ‘ఆ కబంధహస్తాల నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు’ అంటుంటారు. ఇంతకీ ఏమిటీ కబంధ? అడవిలో సీతమ్మ కోసం రామలక్ష్మణులు వెదుకుతున్నప్పుడు వారి ముందుకు ఒక విచిత్రమైన వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి కాళ్లు, తల, మెడ ఉండవు. కడుపు భాగంలో మాత్రం నోరు ఉంటుంది! చేతులైతే చాలా పొడవు. ఎవరైనా తన నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తే చేతుల్తో పట్టుకునేవాడు.
ఆ పట్టు చాలా గట్టిగా ఉండేదట. అందుకే కబంధ హస్తం అని పేరొచ్చింది. ఆ చేతుల్ని తర్వాత రామలక్షణులు నరికేస్తారు. నిజానికి కబంధుడు అందగాడు. కానీ అహంకారి. ఓసారి ఒక మునిని ఆట పట్టించడానికి వికృతరూపం ధరిస్తే.. ఆ మునికి కోపం వచ్చి- ‘‘ఈ రూపమే నీకు శాశ్వతంగా ఉంటుంది’’ అని శపిస్తాడు.
అలంకృత శిరచ్ఛేదం!
పూర్వపు రోజుల్లో నేరాలు ఘోరాలు చేసిన వారి తల నరికేసేవారు. అయితే నరకడానికి ముందు నేరస్తుడి కోరిక ఏదైనా ఉంటే తీర్చేవారు. అంతేకాదు… అతడి తలను అందంగా అలంకరించేవారు. ఆ తరువాతే ఆ తలను నరికేవారు. దాని ఆధారంగానే ఈ జాతీయం పుట్టింది.
కొందరు తమ పని పూర్తయ్యేంత వరకు… చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే వారి పని పూర్తయిపోతుందో, అప్పటి నుంచి వారి స్వభావంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. వారిలోని దుర్మార్గం బట్టబయలై భయపెడుతుంది. ఇలాంటి వారి విషయంలో ఉపయోగించే జాతీయం ఇది.
కాలనేమి జపం
రామాయణం నుంచి పుట్టిన జాతీయం ఇది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ద్రోణగిరిపై ఉన్న ఒక మూలికను తేవడానికి సన్నద్ధుడవుతాడు ఆంజనేయుడు. ఈ విషయం రావణాసురుడికి తెలుస్తుంది. హనుమంతుడిని దారి తప్పించి మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని మారీచుడి కొడుకైన కాలనేమితో చెబుతాడు రావణాసురుడు. ద్రోణగిరిని వెదుకుతూ వెళుతున్న హనుమంతుడికి దారిలో మహర్షి రూపంలో జపం చేస్తున్న కాలనేమి కనిపిస్తాడు.
ద్రోణగిరికి దారి చెప్పమని హనుమంతుడు అడిగినప్పుడు-
‘‘అక్కడ ఉన్న కొలనులో స్నానం చేస్తే కొత్త శక్తి వస్తుంది’’ అని తప్పుడు సమాచారం ఇస్తాడు. ఆ తరువాత ఏమైంది అనేది వేరే విషయంగానీ… దొంగ భక్తులను, చిత్తశుద్ధి లేకుండా పూజాపునస్కారాలు చేసేవాళ్లను, పవిత్రంగా కనిపిస్తూ ఇతరులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించే వాళ్లను ‘కాలనేమి జపం’తో పోల్చుతారు.
చిదంబర రహస్యం!
పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన ఆలయం చిదంబరం. ఈ ఆలయంలో శివుడు నిరాకార స్వరూపుడిగా కొలవబడతాడు. గర్భగుడిలోని ఖాళీ స్థలాన్ని తెరతో కప్పిపెడతారు. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ఈ ఖాళీస్థలం ప్రతీక.
ఏమీ లేకపోయినా తెరను అలా ఎందుకు కప్పిపెడతారు? దీనికి ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు ఎన్ని ఉన్నా చాలామందికి ఇది ‘రహస్యం’గానే మిగిలిపోయింది. ఆ తెర వెనుక ఎన్నో కనిపిస్తాయనేది కొందరి నమ్మకం. కొందరికి బంగారు బిల్వ పత్రాలు కనిపిస్తే కొందరికి మరొకటి. ఈ మర్మం ఎవరికీ అర్థం కానిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైనా తెలియని రహస్యం లేదా తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని ‘చిదంబర రహస్యం’ అనడం పరిపాటిగా మారింది.
తంజావూరు సత్రం
‘రాను రాను ఈ ఇల్లు తంజావూరు సత్రంలా తయారైంది. పని చేసే వాళ్లు తక్కువ… పడి తినేవాళ్లు ఎక్కువ’ ఇలాంటి మాటలు వింటుంటాం. తమిళనాడులోని ప్రాచీన పట్టణం తంజావూరు. కావేరి నది తీరాన ఉన్న ఈ పట్టణం ఆలయాలకి ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. ఆ రోజుల్లో… రాజులు ఆలయాలు కట్టించడమే కాదు… యాత్రికుల సౌకర్యం కోసం అన్నసత్రాలు కట్టించేవాళ్లు. ఈ అన్నసత్రాల వల్ల జరిగిన మంచి మాట ఎలా ఉన్నా… సోమరులకు ఇవి నిలయాలుగా ఉండేవి. ఈ సత్రాల వ్యవహారం ఒక ప్రహసనంలా తయారైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పుట్టిందే ‘తంజావూరు సత్రం’ జాతీయం.
ఒక ఇంట్లో ఒక్కరే కష్టపడుతూ, ఏ పనీ చేయకుండా సోమరిగా కాలం వెళ్లదీసే వాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంటిని తంజావూరు సత్రంతో పోల్చుతుంటారు.
శ్రావణ భాద్రపదాలు
కొందరు ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంటారు. వారికి సమస్యలు లేవని కాదు… ఉన్నా వారి సంతోషానికి అవేమీ అడ్డు కాదు.
కొందరు మాత్రం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖంతో కనిపిస్తారు. సమస్యలు ఉన్నా లేకున్నా ఒకేవిధంగా ఉంటారు. ఏదో విషయంలో ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూనే ఉంటుంది. వారి కళ్లల్లో సంతోషం కాకుండా దుఃఖ వర్షమే ఎప్పుడూ కనిపిస్తుంటుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొనే ‘అతడి కళ్లు శ్రావణ భాద్రపదాల్లా ఉన్నాయి’ అంటారు. శ్రావణ భాద్రపదాలు తెలుగు నెలలు. ఇవి వర్షాకాలపు నెలలు. వర్షాన్ని గుర్తు చేసే నెలలు. కళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి అని చెప్పడానికి ఉపయోగించే జాతీయం ఇది.
సంతోషాన్ని ఇష్టపడే వాళ్లు స్నేహితులైనట్లే, ఎప్పుడూ విచారంతో కనిపించేవారు కూడా స్నేహితులవుతారు. ఇలాంటి జంటను ‘శ్రావణ భాద్రపదాలు’ అని పిలుస్తారు.
గజకచ్ఛపాలు!
పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే అన్నదమ్ములు ఉండేవారు. అన్నదమ్ములంటే ఐకమత్యానికి ప్రతీకలా ఉండాలి. ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఆస్తి కోసం ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు.
ఒకసారి వీరి పోట్లాట శ్రుతి మించింది.
‘‘నువ్వు ఏనుగై పోవాలి’’ అని అన్న శపించాడు.
దీనికి ప్రతి శాపంగా-
‘‘నువ్వు తాబేలైపో’’ అని తమ్ముడు శపించాడు.
అలా ఇద్దరు ఏనుగు, తాబేలైపోయారు.
గజం అంటే ఏనుగు. కచ్ఛపం అంటే తాబేలు.
అన్నదమ్ములు ఏనుగు, తాబేళ్లుగా మారినా వారి బుద్ధి మాత్రం మారలేదు. ఎప్పటిలాగే ఆస్తికోసం పోట్లాడుకునేవారు. ఈ కథ నేపథ్యం నుంచి వచ్చిందే ‘గజకచ్ఛపాలు’ జాతీయం.
ఆస్తి కోసం తరచూ పోట్లాడుకునే అన్నదమ్ములను, దాయాదులను ‘గజకచ్ఛపాలు’ అంటారు.
గట్టి కొమ్మ!
ఆపదలో ఉన్నప్పుడో, కష్టాల్లో ఉన్నప్పుడో ఆదుకునే వ్యక్తిని ‘గట్టి కొమ్మ’తో పోల్చడం పరిపాటి.
ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు గెంతే ప్రయత్నంలో గట్టి కొమ్మను ఊతం చేసుకుంటారు.
కొమ్మ గట్టిదైతేనే క్షేమంగా అవతలి వైపుకు చేరుకుంటాం.
కొమ్మ బలహీనమైతే ప్రమాదంలో పడతాం.
మన క్షేమం అనేది కొమ్మ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది.
మనుషుల్లో కూడా గట్టి కొమ్మల్లాంటి వారు ఉంటారు. బలహీనమైన కొమ్మల్లాంటి వారు ఉంటారు. గట్టి కొమ్మల్లాంటి వారిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. పదిమందికీ ఉపయోగపడే వ్యక్తిని, ఆదుకునే వ్యక్తిని ‘గట్టి కొమ్మ’తో పోల్చు తుంటారు.
పులికి ఏ అడవి అయినా ఒక్కటే!
కొందరికి పని అనేది రెండో విషయం. సౌకర్యాలు, అనుకూలమైన విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. కొందరు మాత్రం పని గురించే ఆలోచిస్తారు. అసౌకర్యాలు, ప్రతికూలతల గురించి ఆలోచించరు. ఇలాంటి వారిని ఉద్దేశించి వాడే మాటే ‘పులికి ఏ అడవి అయినా ఒక్కటే’
పులి తాను ఉన్న అడవికి కాకుండా కొత్త అడవికి వెళితే? అయోమయానికి గురవుతుందా? బెదరుతుందా? భయపడుతుందా?… ఇవేమీ జరగవు. అది ఏ అడవికి వెళ్లినా తన సహజశైలిలో ఎప్పటిలాగే నిశ్చింతగా, నిర్భయంగా ఉంటుంది!
సమర్థుడికి ఎక్కడైనా ఒక్కటే అనే భావాన్ని స్ఫురింపచేయడమే ‘పులికి ఏ అడవి అయినా ఒక్కటే’ మాట ఉద్దేశం.
సింగడు బూరడు!
పూర్వం… యుద్ధం మొదలయ్యే ముందు కొమ్ము బూర ఊదేవారు.
కొమ్ము బూర ఊదడం (సింగినాదం) అనేది యుద్ధానికి సన్నద్ధం కావడం, కయ్యానికి కాలుదువ్వడానికి సూచనగా ఉండేది. ఈ నేపథ్యం నుంచే…
ఎవరైనా కయ్యానికి కాలుదువ్వితే ‘సింగడు బూరడు’ అయ్యాడు అని అంటుంటారు.
బ్రహ్మాండం!
ఒక ఆలోచన గురించో, వస్తువు గురించో ప్రశంసాపూర్వకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు- ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం చూస్తుంటాం. ఇంతకీ ఈ ‘బ్రహ్మాండం’ ఏమిటి? సృష్టికర్త బ్రహ్మ భూగోళాన్ని, ఇతర గోళాలను గుడ్డు(అండం) ఆకారంలో తయారుచేశాడని నమ్ముతారు. భూగోళాన్ని, ఇతర గోళాలను కలిపి ‘బ్రహ్మాండం’ అంటారు.
పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినా, పెద్ద పెద్ద రాక్షసులు గట్టిగా అరిచినా… ఇంకేమైనా పెద్ద ఘటనలు జరిగినా బ్రహ్మాండ భాండం(కుండ) బద్దలవుతుంది అంటారు.
స్థూలంగా చెప్పుకోవాలంటే ‘బ్రహ్మాండం’ అంటే ‘చాలా పెద్దది’ అని అర్థం. అందువల్ల పెద్ద పనులు, వస్తువుల విషయంలో ఈ మాటను వాడేవారు. అయితే కాలక్రమంలో అద్భుతమైన, అసాధారణ విషయాలు, విజయాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం మొదలైంది.
దంపతి కలహం!
‘వాళ్ల పోట్లాట చూసి కంగారు పడకు. అది దంపతి కలహం’
‘దంపతులన్నాక కలహం మామూలే కదా. పెద్దగా పట్టించుకోవాల్సిన కలహం కాదు… దంపతి కలహం అనే మాట ఉండనే ఉంది కదా’… ఇలాంటి మాటలు వింటుంటాం.
దంపతి అంటే భార్యాభర్తలు.కలహం అంటే తగాదా.
దాంపత్యంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో, తగాదాలు కూడా అంతే సహజం. కొందరు దంపతులు తీవ్రంగా తగాదా పడతారు. ఆ తరువాత కాసేపటికే మామూలై పోయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. భార్యభర్తలు తగాదా పడుతున్నప్పుడు మధ్యలో వెళ్లినవారిని- ‘అది భార్యభర్తల తగాదా. ఇప్పుడే తిట్టుకుంటారు. ఇప్పుడే కలుసుంటారు. మధ్యలో నువ్వెళ్లడం దేనికి?’ అనే మాట కూడా వింటుంటాం.
భార్యభర్తల మధ్య తగాద అనేది తాటాకు మంటలాంటిదని, అది శాశ్వతమైన శత్రుత్వం కాదు అని చెప్పడానికే ‘దంపతి కలహం’ అనే మాట వాడతారు.
చీకటిని నెత్తినేసుకొని…
సూర్యుడింకా ఉదయించక ముందే, చాలా పొద్దున్నే బయటికి వెళ్లినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీకటిని నెత్తినేసుకొని వెళ్లాడు’ అంటారు.
తెల్లవారుజామున చీకటి చీకటిగానే ఉంటుంది.
బయటికి వెళ్లేటప్పుడు తలకు రుమాలు కట్టుకొని వెళుతుంటారు. అలా చీకటిని తల మీద వేసుకొని బయటికి వెళుతున్నాడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
నాథుడు!
‘ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు’
‘నగరంలో ఎటు చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు’లాంటి మాటలను తరచుగా వింటుంటాం.
నాథుడు అనే పదానికి ‘భర్త’ ‘రాజు’ అనే అర్థాలు ఉన్నాయి.
అయితే వ్యవహారికంలో మాత్రం వేరే అర్థాలు ఏర్పడ్డాయి.
‘ఆధారం’ ‘పెద్దదిక్కు’ ‘బాగోగులు చూసేవాడు’ మొదలైన అర్థాలతో ఇప్పుడు ‘నాథుడు’ను వాడుతున్నారు.
ఇప్పటిదా అప్పటిదా…
ఇక్ష్వాకుళ కాలం నాటిది!
చాలా పాత విషయం, చాలా పాత వస్తువు, వయసు పైబడిన వ్యక్తులు… ఇలాంటి విషయాలలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం చూస్తుంటాం.
‘ఇది నిన్న మొన్నటి వస్తువు కాదు… ఇక్ష్వాకుల కాలం నాటిది’… ‘అదేదో నిన్నగాక మొన్న జరిగిన విషయం అన్నట్లు చెబుతావేం? ఇక్ష్వాకుల కాలం నాటిది’ ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. అసలా మాట ఎలా వచ్చింది?
వైవశ్వతుడు-శ్రద్ధాదేవి దంపతులకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఇక్ష్వాకుడు పెద్దవాడు. శ్రీరాముడి వంశానికి ఇతడే మూల పురుషుడు. ఇక్ష్వాక రాజు ఎప్పటి వ్యక్తో కాబట్టి… ‘చాలా పాత’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
మర్కట ముష్టి!
ఈ జాతీయాన్ని రక రకాలుగా ఉపయోగిస్తారు.
‘చాలా మొండి మనిషి. పట్టిందే పట్టు. మర్కట ముష్టి!’
‘నువ్వు ఆయనకు దానధర్మాల గొప్పదనం గురించి ఎంతసేపు చెప్పినా ఆయన మనసు మారదు. అది మర్కట ముష్టి. ఒక్క గింజ కూడా రాలి పడదు!’
ఒక విషయం మీద చాలా పట్టుదలగా, మొండిగా వ్యవహరించే వారి విషయంలోనే కాదు… ‘నేను సంపాదించిన దాంట్లో ఒక్క చిల్లిగవ్వను కూడా ఇతరులకు ఇవ్వను’ అనుకునే పరమ పిసినారుల విషయంలో కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
మర్కటం అంటే కోతి. ముష్టి అంటే పిడికిలి. కోతి తన పిడికిట్లో ఏదైనా పట్టుకుంటే పొరపాటున కూడా వదలదు. దాన్ని ఎంత బతిమిలాడితే అంతగా పట్టు బిగిస్తుంది. బెదిరిస్తే తిరిగి మనల్నే బెదిరిస్తుంది.
స్థూలంగా చెప్పాలంటే… కోతి పిడికిలి బిగించిందంటే, ఆ పిడికిలిని తెరిపించడం చాలా కష్టమైన పని. అందుకే పట్టుదలకు, పీనాసితనానికి ఆ మాట స్థిరమై ఉండిపోయింది.
ఏమైంది… నలభై అయింది!
‘ఇంతకీ విషయం ఏమైంది?’
‘ఏమవుతుంది? సరిగ్గా నలభై అయింది!’
‘ఏ పని చేసినా విజయం సాధించాలి… నలభై సాధించడం కాదు’… ఇలాంటి మాటలు మన వాడుకలో ఉన్నాయి.
ఇక్కడ ‘నలభై’ అనేది కేవలం సంఖ్య కాదు… పరాజయం, పరాభవానికి ప్రతీక.
అలా ఎలా అవుతుంది? అసలు నలభైకీ పరాజయానికీ ఉన్న లింక్ ఏమిటి?
ఏమిటంటే, మనకున్న తెలుగు సంవత్సరాల పేర్లలో నలభయ్యవది… పరాభవ. అందుకే అపజయం, పరాభవం, అవమానం వంటి విషయాలకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
ఇదిగో గుర్రం అదిగో మైదానం!
ఒక వస్తువు నాణ్యత, శక్తి గురించి అప్పటికప్పుడు తేల్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ మాటను వాడుతారు.
‘‘నాణ్యత గురించి ఎలాంటి సందేహం అక్కర్లేదు… ఇదిగో గుర్రం అదిగో మైదానంలా ఎలాంటీ పరీక్ష అయినా చేసుకోవచ్చు.’’
‘‘ఈ గుర్రంలో చేవ ఉందా?’’ అనే ప్రశ్నకు- ‘‘చాలా ఉంది. భేషుగ్గా ఉంది’’ లాంటి మాటలు సృంతృప్తిని ఇవ్వవచ్చును గానీ… ఎక్కడో ఒక మూల చిన్న సందేహమేదో కదలాడుతూనే ఉంటుంది, ‘అతను చెప్పింది నిజమేనా?’ అని.
మాటలు కాదు… చేతలు ముఖ్యమను కున్నప్పుడు… పరీక్ష మాత్రమే సంపూర్ణ సంతృప్తిని ఇస్తుంది. గుర్రంలో ఉన్న చేవను తెలుసుకోవడానికి మైదానంలో ఒక్కసారి సవారీ చేస్తే సరిపోతుంది కదా!
నక్షత్రకుడు!
‘నక్షత్రకుడిలా నా వెంటబడి చావగొట్టకు’
‘అబ్బో… అతని గురించి చెప్పాలంటే నక్షత్రకుడిని మించి ఇబ్బందులు పెడతాడు’ అంటుంటారు.
నక్షత్రకుడు విశ్వామిత్రుడి శిష్యుడు. విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును రాబట్టడానికి… హరిశ్చంద్రుడితో పాటు నీడలా వెళతాడు. హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలతో నడుస్తుంటే ‘నేను నడవలేను’ అని కూర్చునేవాడు. సరే అని కూర్చుంటే నిలబడేవాడు.
‘‘నేను నడవలేక పోతున్నాను నన్ను ఎత్తుకో’’ అనేవాడు. నీళ్లు దొరకని చోటు చూసి నీళ్లు కావాలి అని అడిగేవాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు.
రకరకాల సమస్యలతో బాధ పడే వారికి ఎవరైనా సరికొత్త సమస్యగా తయారైతే అలాంటి వ్యక్తిని నక్షత్రకుడితో పోల్చుతారు.
గజ్జెలు కట్టిన కోడి!
తమ సహజ అవలక్షణాలను మార్చుకోని వారి విషయంలో వాడే మాట ‘గజ్జెలు కట్టిన కోడి’.
‘కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించకుండా ఉంటుందా?’ అని అంటుంటారు. వెనకటికి ఒకాయన దగ్గర ఒక కోడి ఉండేది. ఆ కోడి తన సహజశైలిలో పెంటకుప్పల వెంట తిరిగేది.
తన ముద్దుల కోడి ఇలా అసహ్యంగా పెంటకుప్పల మీద తిరగడం ఆ ఆసామికి నచ్చలేదు. దీంతో ఆ కోడిని బాగా అలంకరించి కాలికి గజ్జె కట్టాడు. ఈ అలంకారాలతో కోడి ప్రవర్తనలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్మాడు. ఎంతగా అలంకరించినా కోడి మాత్రం తన సహజశైలిలో చెత్తకుప్పలు కుళ్లగించడం మానలేదు!
శశ విషాణం
అసాధ్యమైన పనులు లేదా వృథాప్రయత్నాల విషయంలో వాడే జాతీయం ‘శశ విషాణం’.
‘నువ్వు చెబుతున్న పని శశ విషాణం సాధించడంలాంటిది’.
‘శశ విషాణం కోసం ప్రయత్నించి విలువైన సమయాన్ని వృథా చేయకు’ ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి.
శశం అంటే కుందేలు.
విషాణం అంటే కొమ్ము.
కుందేలుకు పెద్ద చెవులే గానీ కొమ్ములు ఉండవు కదా! ఇలా లేని దాని కోసం ప్రయత్నించడం, అసాధ్యమైన వాటి గురించి ఆలోచించే విషయంలో ఉపయోగించే ప్రయోగమే శశ విషాణం.
చగరుడాయ లెస్సా అంటే…శేషాయ లెస్సా అన్నట్లు!
ఇద్దరూ సమ ఉజ్జీలైనప్పుడు పలకరింపుల్లో గానీ, పట్టుదల విషయంలో గానీ ఎవరికి వారు ‘నేనే గొప్ప’ అనుకుంటారు. ఈ ఇద్దరిలో ఒకరు చొరవ తీసుకొని మొదట పలకరిస్తే… రెండో వ్యక్తి అతిగా స్పందించడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు.
‘బాగున్నారా?’ అని మొదటి వ్యక్తి పలకరిస్తే-
‘బాగున్నాను. మీరు బాగున్నారా?’… అని రెండో వ్యక్తి సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతాడు. ఇంతకు మించి సంభాషణ ముందుకు సాగదు.
గరుడుడు, శేషుడు… వీరిలో గొప్ప ఎవరు అంటే ఏమి చెప్పగలం?
ఎవరికి వారే గొప్ప!
‘ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, పలకరించుకోవాలి కాబట్టి పలకరించుకున్నారు…’ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ‘‘వారి మాటల్లో పెద్ద విశేషాలేమీ లేవు. ఏదో… గరుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు పలకరించుకున్నారు’’ అంటుంటారు.
మరికొన్ని …………
1. అమీ తుమీ :
వాస్తవానికి ఇవి బెంగాలీ భాషకు చెందిన పదాలు. అయినప్పటికీ తెలుగు పదలుగా చెలామణి అవుతున్నాయి. ఇక అర్ధంలోకి వస్తే అమీ అంటే నేను, తుమీ అంటే నువ్వు అనర్ధం. ఏదేని ఒక సంఘర్షణ సంభవించినప్పుడు నువ్వో నేనో తేల్చుకుందాం అనే చాలెంజి విసురుకునే క్రమంలో అమీ తుమీ అనే జాతీయాన్ని వాడతాము.
2. కత్తి మీద సాము :
సాము అంటే విన్యాసం. విన్యాసమనేది ఒక యుద్ధ విద్య కావచ్చు లేక నాట్యానికి సంబంధించినదైనా కావచ్చు లేక ఏకాగ్రతతో చేసే ఏ పనైనా కావచ్చు. ఏదేమైనా వీటిని నేల మీద చెయ్యాలంటేనే ఎంతో నేరుపు, ఓర్పు, సహనం ఉండాలి. అటువంటిది కత్తి మీద సాము చెయ్యడమంటే ఎంత కష్ట సాధ్యమో ఆలోచించాలి. ఏదైనా పని అసాధ్యం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం.
3. కరతలామలకం :
చాలా సులభం అని దీనికి అర్ధం. కరం అంటే చెయ్యి. అమలకం అంటే ఉసిరికాయ. ఉసిరికాయ అరచేతిలో చాలా తేలిగ్గా ఇమిడిపోతుంది కాబట్టి అంత తేలిక అని దీని భావం. ఒక వ్యక్తి ఏదేని విషయంలో ఎక్స్పర్ట్ అనే అర్ధంలో ఈ జాతీయాన్ని వాడతాం.
4. గాడిద గుడ్డు :
గాడిద గుడ్డు పెట్టదు. అంటే ఏమీ లేదని దీనర్ధం. విసుగు పుట్టినప్పుడు ఈ జాతీయం అక్కరకొస్తుంది సహజంగా.
5. గొంతెమ్మ కోరిక :
కుంతికి విక్రుత నామమే గొంతి. కాలక్రమేణా అదె గొంతెమ్మ అయ్యింది. తనకు వరప్రసాదమైన కోరికను అనాలోచితంగా కుంతి కోరుకోవడంతో ఆమెకు వివాహానికి ముందే సూర్య భగవానుడి వల్ల కర్ణుడు జన్మిస్తాడు. అందువల్ల ముందుచూపు లేకుండా చేసే చర్యలు ఇబ్బంది పెడతాయని దీని భావన. అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో తన ఇద్దరు కుమారులైన కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ బ్రతకాలని ఆమె కోరుకుంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి అటువంటి సాధ్యం కాని కోర్కెలను కోరుకునేవారిని గొంతెమ్మ కోరికలు కోరుకోవద్దని పెద్దలు సలహా ఇస్తుంటారు.
6. తథాస్తు దేవతలు :
తమ పిల్లలు వేకువ జామునగానీ, చీకటి పడే సమయంలోగానీ చెడు మాటలు పలక్కుండా పెద్దలు నియంత్రణలో పెడతారు. దానికి కారణం ఆ సమయాల్లో దేవతలు ఆకాశంలో సంచరిస్తుంటారనీ, ఆయా వేళల్లో తిట్టుకుంటే ఆ దేవతలు తథాస్తు అంటారని, దానివల్ల వారికి చెడు జరుగుతుందని పిల్లలకు చెప్పి వాళ్ళను భయపెడతారు. ఇది కేవలం వారి మానసిక ప్రవృత్తిలో మార్పు తీసుకురావడంకోసం మాత్రమే పెద్దలు అలా అంటుంటారు. తమ పిల్లల నోట ఏ సమయంలోనూ పాడు మాటలు రాకూడదని పెద్దల ఆలోచన.
7. నకరాలు పోవడం :
నకరం అంటే వ్యాపారం చేసే ప్రాంతం. నకరాలు పోవడం అంటే కొనుగోలు చేయడం కోసం ఆర్భాటంగా పోవడం. నకరాకి వెళ్ళి అక్కడ పెద్దయెత్తున కొంటున్నట్లు హడావిడి చేయడం. చివరికీ మాట బడాయి పోవడం, పోజు కొట్టడం అనే అర్ధాలనిచ్చే జాతీయంగా మారింది.
8. మొసలి కన్నీరు :
ఎడుపు నటించే వారిని మొసలి కన్నీరు కారుస్తున్నాడంటారు. అసలు మొసలి కన్నీరు అనే పేరు ఎందుకొచ్చిందంటే…మొసలికి దయా దాక్షిణ్యాలు ఉండవు. అందిన జీవిని అందినట్లు తినడమే దాని పని. జాలి, దయ లేని మొసలి ఎదుటి వ్యక్తి గురించి కన్నీరు కార్చడమనేది అసాధ్యం. అది జాలి, దయ లేని మానవులకు కూడా వర్తిస్తుంది. అంతే కాదు నయవంచకులకు కూడ వర్తిస్తుంది. అందుకే మొసలికి కన్నీరు ఎలా రాదో కల్లబొల్లి కబుర్లరాయుళ్ళకు కూడా అంతే అనీ, అటువంటి వారి కన్నీళ్ళను నమ్మరాదని దీని భావన.
9. వేలం వెర్రి :
వేలం పాటంటే అందరికీ తెలిసిందే. ఒక వస్తువును బహిరంగంగా ప్రజల సమక్షంలో అమ్మకానికి పెట్టడం. ఇది కొనుగోలుదారుల మధ్య పోటీ అన్నమట. ఆ వస్తువులు ఎవరు ఎక్కువ ధరకు కొనుక్కుంటారో వాళ్ళదే ఆ వస్తువు. ఆ వస్తువు మీద మోజున్నవారు మాత్రమే ఆ పోటీలో పాల్గొంటారన్నమాట. దానివల్ల ఒక్కొక్కప్పుడు ఆ వస్తువు అసలు ధరకంటే కూడా వేలంలో మరింత ధర ఎక్కువ పలకవచ్చు. ఐనా పట్టుదలకు పోయి అలా ధరని పెంచుకుంటూ పోవడాన్ని వేలం వెర్రి అంటారు. వస్తువును దక్కించుకున్నవారు ఆ తరువాత ధర ఎక్కువ పెట్టినందుకు చింతించక మానరు. ఈ విధమైన పోటీ తత్వం మంచిది కాదనే ఉద్దేశ్యంలో ఈ జాతీయం ఏర్పడింది.
ఇలా అనేక జాతీయాలు తెలుగు భాషను సుసంపన్నం చేసాయి. జాతీయాలు అనుకరణకు సాధ్యం కానివి. అందుచేత తెలుగు నుడికారమంటే ఇతర భాషలలోనూ ఎంతో గౌరవముంది.
సేకరణ : http://www.telugudanam.co.in/saahityam/Jaateeyaalu.php
మొండిచేతి వాడికి నువ్వులు తినడం నేర్పినట్టు…
క ఆసామి నువ్వుల్ని పండించాడు. మామూలు వాళ్లయితే నువ్వులు తినేస్తారేమోనని భయమేసి, వెతికి వెతికి ఓ మొండి చేతుల వాడిని తీసుకొచ్చి పొలంలో పనికి పెట్టుకున్నాడు. అయినా కూడా వాడి మీద అనుమానంగానే ఉండేది. ఎప్పటికప్పుడు వాడిని పరిశీలిస్తూ ఉండేవాడు. అంతలో పనిమీద పక్కూరికి వెళ్లిన ఆసామి, రెండు రోజుల వరకూ రాలేకపోయాడు. తాను లేనప్పుడు పనివాడు నువ్వులు తినేశాడేమోనన్న అనుమానంతో, వచ్చీ రాగానే ‘ఏరా… నువ్వులు తిన్నావా’ అని అడిగాడు. ‘చేతుల్లేనివాడిని, నేనెలా తినగలను సామీ’ అన్నాడు వాడు. వెంటనే ఇతగాడు… ‘ఏముంది, మొండి చేతులకు నూనె రాసుకుని, వాటికి నువ్వుల్ని అద్దుకుని తినొచ్చు కదా’ అన్నాడు. ఇదేదో బాగుందే అనుకున్న పనివాడు అప్పట్నుంచీ నిజంగానే నువ్వులు తినడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. మంచివాడికి లేనిపోని ఆలోచనలు కల్పించి, తప్పుదారి పట్టించినప్పుడు ఈ సామెత వాడతారు.
http://www.sakshi.com/news/funday/proverbs-follow-around-human-entire-life-on-motion-131372
రామాయణమంతా విని, రాముడికి సీతేమౌతుందన్నట్టు…
ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు రాత్రీపగలూ కష్టపడి పని చేస్తుండేవాడు. ఓసారి ఆ ఊళ్లో రామాయణ కథాశ్రవణం ఏర్పాటు చేశారు. దానికి ఇతగాడు కూడా వెళ్లాడు. అయితే బాగా అలసిపోయి ఉండటంతో ఏమీ వినకుండా నిద్రపోయాడు. వారం రోజుల పాటు అలా వెళ్తూనే ఉన్నాడు, నిద్రపోతూనే ఉన్నాడు. చివరి రోజున శ్రవణం ముగిశాక ఓ ఆసామి… ‘‘అసలు నువ్వు ఒక్కరోజైనా రామాయణం విన్నావా, నిద్రపోతూనే ఉన్నావ్’’ అని అన్నాడు. దానికి ఇతడు… ‘‘ఎందుకు వినలేదూ… బాగా విన్నాను. చక్కగా అర్థం చేసుకున్నాను. కానీ ఒక్కటే సందేహం. రాముడికి సీతేమవుతుంది?’’ అన్నాడు. దాంతో అందరూ ఘొల్లుమన్నారు. అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోకి వచ్చింది. చెప్పినదంతా విని కూడా ఎవరైనా అర్థం లేని ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సామెత వాడుతుంటారు.
చుప్పనాతి శూర్పణఖ
ఈ జాతీయంలోని చుప్పనాతి అనే పదం శూర్పణఖ కి రూపాంతరంగా కనిపిస్తోంది..
శూర్పణఖ రామాయణంలోని ముఖ్యమైన పాత్ర. నిజానికి కర్ణుడు లేని భారతం లాగే శూర్పణఖ పాత్ర ప్రమేయంలేకపోతే రామరావణ యుద్ధమే లేదు. శూర్పణఖ రావణాసురుని చెల్లెలు. పంచవటిలో సీతారాములు ఉన్న చోటకి వచ్చి రాముడిని చూసి మోహించింది. రాముడు తనకు సీత ఉందని, లక్ష్మణుడిని వరించమని పంపించాడు. లక్ష్మణుడు శూర్పణఖ కు ముక్కు చెవులు కోసి అవమానించి పంపించాడు. ఆ అవమానానికి ప్రతీకారంగానే రావణాసురుడిలో సీతపైన కోరిక పుట్టేలా, రాముడి పై శత్రుత్వం పెరిగేలా చేసింది. చివరకు దాని ఫలితంగా రామరావణ యుద్ధం జరిగి లంకకే చేటు తెచ్చింది. సీత సౌందర్యంపట్ల అసూయ, కోరినదాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే కాంక్ష, తనకు లేని సుఖం ఇతరులకు ఉంటే భరించలేని ఓర్వలేనితనం ఇవన్నీ శూర్పణఖ పాత్ర లోని లక్షణాలు.
ఈ శూర్పణఖ లక్షణాలు కొన్ని ఉన్నా అటువంటివారిని చుప్పనాతి శూర్పణఖ అంటూ చెప్పడం తెలుగు జాతీయంగా మారింది.
చుప్పనాతి అంటే మోసం, కపటం, ఓర్వలేనితనం వంటి గుణాలున్న, కుటిలత్వం కలిగిన వ్యక్తిత్వంగా తెలుగు జాతీయంలో కనిపిస్తుంది.
కొంగజపం
భగవంతుడి నామాన్ని పదే పదే పలకడాన్ని జపం చేయడం అంటారు. తపస్సు చేసే యోగులు అలా నామజపం చేస్తూ తపస్సు సాగిస్తారు. క్రమగా తపస్సు తీవ్రం అయినప్పుడు ఒంటికాలిపైన నిలబడి జపం చేస్తూ తపస్సు సాగిస్తారు.
చెరువులు, నదుల ఒడ్డున చేపలకోసం కొంగలు కాచుకొని ఉంటాయి.అవకాశం దొరకగానే చేపలను పట్టేస్తాయి. ఆ కొంపలు చేపలకోసం నిలబడినప్పుడు ఒంటికాలిపైన నిలబడడం చూస్తాం. ఈ భంగిమ తపస్సు చేసే మునుల భంగిమను పోలి ఉండడం వలన ఈ జాతీయం ఏర్పడింది.
మునులు ఒంటికాలిపై మోక్షంకోసం చేసే సాధన కొంగలు తమ కుక్షికోసం చేస్తాయి. అందువల్ల కొంగజపం దొంగజపమే కానీ నిజంకాదని ఈ జాతీయం ఉద్దేశం.
పంచతంత్రంలో కొంగ- ఎండ్రకాయ కథలో కనబడే కొంగ ఈ విధంగానే కళ్ళుమూసుకొని, ఒంటికాలిపై నిలబడి ధ్యానం చేస్తున్నట్టు నటించి ఆ చెరువులో ఉన్న చేపలను మోసం చేసి చివరకు అన్నిటినీ తినేస్తుంది.
అందువల్ల పవిత్రంగా, మంచివారిగా నటిస్తూ మోసం చేసేవారి చర్యల గురించి హెచ్చరించేది ఈ కొంగజపం అనే జాతీయం.
ఘనాపాటి /. ఘనాపాఠి
వేదవిజ్ఞానం భారత దేశానికి మహర్షులు ఇచ్చిన వరం. వేదమంత్రాలలో మానవ మనుగడకి సంబంధించిన తరతరాల అపారమైన అనుభవసారం నిక్షిప్తం చేయబడింది. ఉదాత్త అనుదాత్త స్వరాలను సక్రమంగా ఉచ్చరిస్తూ వేదపఠనం జరగాలి. అందుకే వేదాలను లిఖించలేదు. వాటిని సక్రమమైన పద్ధతిలో పలకాలి. గురుశిష్య పరంపరతో శ్రుత పద్ధతిలో నేర్పబడతాయి వేదమంత్రాలు. ప్రతి అక్షరానికి నిర్దిష్టమయిన నాదం విధించబడింది. వేదమంత్రాలను ఉచ్చరించడం, గుర్తుపెట్టుకోవడం అనేది అసాధారణమయిన ప్రజ్ఞకి సంబంధించిన విషయం. ఈ వేదమంత్రాలు పఠించడంలో వివిధ పద్ధతులున్నాయి. అవి సంహిత, పద, క్రమ, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ,రథ, ఘన. వేద శిక్ష లో సంహితతో ప్రారంభమయ్యే వేదపాఠాన్ని క్రమ పద్ధతిలో పట్టు వచ్చేసరికి విద్యార్థికి పది సంవత్సరాలు కనీసం పడుతుంది. ఎంతో ఏకాగ్రతతో పట్టుదలతో మరొక ఐదారు సంవత్సరాలు అసాధారణ ప్రజ్ఞ కనపరిచిన వేదవిద్యార్థి మాత్రమే జట, ఘన అనే స్థాయికి చేరి వేదపఠనంలో చివరిస్థాయికి చేరగలుగుతాడు. అందువల్ల వేదవేదాంగాలను సుస్వరంగా, మంత్రవిహితంగా ఉదాత్తానుదాత్త స్వరాలతో పఠించడంతో పాటు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా కలిగిన వారు మాత్రమే ఘనాపాఠి అనిపించుకోగలుగుతారు.
ఘనాపాఠి అనే మాట వెనుక వేదసంస్కృతికి సంబంధించిన విషయం ఇది. అయితే ఎన్నో విషయాలు తెలిసినవాడు, అపారమైన ప్రతిభాసంపత్తులు కలిగినవారు అని ఎవరినయినా పొగడాలనుకున్నప్పుడు తెలుగువారు ఘనాపాఠి /ఘనాపాటి అనే జాతీయం ప్రయోగిస్తున్నారు ఇప్పుడు. ముఖ్యంగా మన దినపత్రికలలో చాలా తరచుగా ఈ ప్రయోగం కనిపిస్తుంది.
గ్రహచారం
తెలుగు జాతీయాల్లో ఈ గ్రహచారం అనే పదం సామాన్యంగా అదృష్టం అని చెప్పడానికి పర్యాయపదంగా వాడుతున్నాం.
చర అంటే కదలిక గ్రహచారం అంటే గ్రహాల కదలిక అని. గ్రహాలు కదులుతూ ఉంటాయి. మనిషి పుట్టినప్పుడు తిథివారనక్షత్రాల ను బట్టి జాతక చక్రం వేసి అతని జీవిత గమనాన్ని అంచనా వేస్తుంది జ్యోతిష్యశాస్త్రం. గ్రహాలు ఆయారాశులలో చేసే ప్రయాణాలను బట్టి వివిధరాశులలో రకరకాల ఫలితాలు చెప్తారు జ్యోతిష్యులు. ఈవిధంగా గ్రహాలను బట్టి అదృష్టం, దురదృష్టం నిర్ణయింపబడే సంస్కృతి ఆధారంగా పుట్టిన మాట ఈ గ్రహచారం. అతని గ్రహచారం బాగాలేదు అందుకే అలా జరిగింది -లాంటి మాటల్లో ఈ జాతీయం కనిపిస్తుంది.
ఋష్యశృంగుడు
ఈ ఋష్యశృంగుడనే పాత్ర రామాయణ గాథలో చూస్తాం.
విభాండకుడనే ముని పుత్రుడు ఋష్యశృంగుడు. తలపైన కొమ్ముతో జన్మించాడు.తండ్రి ద్వారా వేదవేదాంగ పారంగతుడైన ఋష్యశృంగుడు లౌకికమైన విషయ సుఖాల గురించి ఏమీ తెలియకుండానే పెరిగాడు. అంగరాజ్యంలో క్షామం ఏర్పడినప్పుడు ఆ రాజ్యప్రభువైన రోమపాదుడికి మంత్రులు ఈ ఋష్యశృంగుడి గురించి వివరిస్తారు. అతను ఉన్నచోట వర్షాలు కురుస్తాయని చెప్తారు. విషయసుఖాలగురించి తెలియని ఋష్యశృంగుడిని ఆకర్షించడానికి రోమపాదుడు వేశ్యలను అరణ్యానికి పంపించి వారి ద్వారా అతనిని తన రాజ్యానికి రప్పిస్తాడు. ఋష్యశృంగుడు అంగరాజ్యంలోకి ప్రవేశించగానే వర్షాలు కురిసి ఆ రాజ్యం సస్యశ్యామలమవుతుంది. రోమపాదుడు అతని కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు. దశరథుడికి ఈ అంగరాజ్య ప్రభువుతో స్నేహం కలిగినతర్వాత ఈ ఋష్యశృంగుడిని తన రాజ్యానికి ఆహ్వానించి అతని ఆధ్వర్యంలోనే పుత్రకామేష్టి, అశ్వమేధయాగాలను చేసాడు. రామాయణం బాలకాండలో ఈ ఋష్యశృంగుడి కథ ఇలా వివరించబడింది
అయితే స్త్రీల గురించి ఏమీ తెలియని అమాయకుడిగా పెరిగిన ఋష్యశృంగ మహర్షిలోని స్వభావాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు జాతీయం ఋష్యశృంగుడు అనే పదం వ్యవహరించబడుతోంది.
ఋష్యశృంగుడు అంటే స్త్రీవిముఖుడు, అమాయకుడు అనే అర్థంతో తెలుగు జాతీయం ప్రయోగిస్తాం. అలాగే ఒక వ్యక్తిలోని స్త్రీలోలత్వాన్ని గురించి వేళాకోళం చేసే సందర్భంలో కూడా అబ్బో…ఆయన ఋష్యశృంగుడు అనే మాటతో వెటకారం చేయడం కూడా కనిపిస్తుంది.
గ్రహణం పట్టడం
సాధారణంగా మనం చంద్రగ్రహణం, సూర్య గ్రహణం అనే పేర్లు వింటూ ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ భ్రమిస్తుంది. భూమికి చంద్రుడు ఉపగ్రహం. చంద్రుడు భూమి చుట్టూ భ్రమిస్తూ ఉంటాడు. భూమి సూర్యుడు చంద్రుడు ఇలా భ్రమించడంలో సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కొంతసేపు కనపడడు. చంద్రుని నీడ పాక్షికంగా కొంతసేపు సూర్యుడిని కప్పేయడం వలన ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అలాగే భూమి చుట్టు భ్రమిస్తున్న చంద్రుడిపై సూర్యకాంతి పడడం వలన మనకు చంద్రుడు కనిపిస్తాడు. అయితే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అదే కక్ష్యలోకి వచ్చినపుడు భూమినీడ చంద్రునిపై పడి చంద్రుడు మనకు కొంతసేపు కనపడడు. దీనిని మనం చంద్ర గ్రహణం అంటాం.
అంటే ఒక గ్రహం నీడ మరొక గ్రహం మీద పడి అది కనిపించకుండా పోవడాన్ని గ్రహణం అంటాం. పురాణ గాథల ప్రకారం రాహువు, కేతువు అనేవారు రాక్షసులు. దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతున్న మోహినిఅవతారంలోని విష్ణువు కన్నుకప్పి కొంత అమృతాన్ని గ్రహించారు. ఈ విషయాన్ని విష్ణువు చెవిన వేసిన సూర్యచంద్రులమీద కక్షతో సంవత్సరానికొకసారి వారిని మింగుతారని అప్పుడే గ్రహణాలు ఏర్పడతాయని పురాణ గాథ
ఈ నేపథ్యంలో ఏర్పడినదే ఈ గ్రహణం పట్టడం అనే జాతీయం. ఏదైనా పని సాగకుండా ఆటంకం కలిగి, అది ఆగిపోయింది అని చెప్పడానికి గ్రహణం పట్టింది అని వ్యవహరిస్తారు.
గగనకుసుమం
గగన కుసుమం అనే పదబంధంలో గగనం అంటే ఆకాశం. కుసుమం అంటే పువ్వు. ఆకాశం అంటేనే శూన్యం అని అర్థం. అందువల్ల దానికి పువ్వు పూయడం అనేది ఉండదు కాబట్టి అసంభవం అనే ఉద్దేశంలో ఈ జాతీయం పుట్టింది. గగనము అంటే ఆకాశం అందనిది, చేరుకోలేనిది కనుక అక్కడ కుసుమం ఉన్నా అది అందుకోలేనిదే. కాబట్టి గగనకుసుమం అంటే అసాధ్యమయినది, పొందలేనిది అనే అర్థం లో ప్రయోగించబడుతున్న జాతీయం.
సంస్కృత భాషలో జాతీయాలను న్యాయములు అంటారు. ఆ సంస్కృత న్యాయాలలో అసాధ్యమైనదానిగురించి చెప్పినప్పుడు గగన కుసుమం అని చెప్పడం ఉంది. తెలుగు జాతీయం – గగనకుసుమం సంస్కృత సాహిత్య పరిచయం వలన వచ్చినదే.
మరిన్ని జాతీయాలకు లింకులు :
వీరందరికీ కృతజ్ఞతలు
http://www.sakshi.com/news/funday/proverbs-all-make-sense-of-humor-in-human-life-137613