సామర్లకోటను చూస్తే అక్కడి చరిత్రాత్మక షుగర్ ఫ్యాక్టరీ, విశాఖకు దగ్గరలోని ప్రఖ్యాతిగాంచిన రైల్వేస్టేషనే ప్రపంచానికి కనిపిస్తుంది. విప్లవోద్యమ స్పర్శ ఉన్న వాళ్లకు మాత్రం సామర్లకోటంటే సోమాచారి గుర్తుకు వస్తాడు. సోమాచారి ప్రతిఘటనా దారుల్లో పుష్పిస్తాడు. విప్లవోద్యమ బాటల్లో ఒక మైలురాయిగా నిలుస్తాడు.
మోగులూరి సోమాచారి యోధుడే. ప్రజల కోసం ప్రతిఘటనా మార్గం ఎంచుకున్న వీరుల దారిలో మోగులూరి ప్రతిఘటనా జెండానే. 2016 జూన్ 6న తుది శ్వాస విడిచే దాకా నీ కోరిక ఏదంటే ప్రజల విముక్తే అని చెప్పిన సోమాచారి ఆత్మకథే విప్లవ ఆత్మకథ. విప్లవాల ఆత్మకథ.
ఆత్మకథలకు అర్థాలు, తాత్పర్యాలు, నిర్వచనాలు ఏ విధంగానైనా చెప్పవచ్చును. జీవితంలో మలుపు తిరుగుతున్న ప్రతి అడుగు జీవుల ఆత్మకథలే. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న నరాల గుట్టలన్నీ లెక్కవేస్తే ప్రపంచమంతా ఆత్మకథలతో నిండిపోతుంది. ఆత్మకథలు చెప్పే కథలు ఇతరులకు ఎందుకు ప్రేరణ అవుతాయో సోమాచారి ఆత్మకథ చదువుతుంటే అర్థమౌతుంది. ఆత్మకథలు ఎందుకు రాయాలో అన్న విషయం కూడా సోమాచారి ఆత్మకథ చూస్తే అవగతమవుతుంది.
గతించిన కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రధానంగా విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన పంచకర్మలు ఏ విధంగా జీవించారు? ఆనాటి ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉన్నాయి? పెళ్లిళ్లు ఎలా జరిగాయి? ఆత్మీయతలు ఎలా ఉన్నాయి? ఊర్లో సాటి మనుషుల్ని ఏ విధంగా చూసేవారు? రెక్కల కష్టం తప్ప వేరే దారులు తెలియని వారి స్థితిగతులు ఎలా ఉంటాయో సోమాచారి కుటుంబాన్ని చూసి తెలుసుకోవచ్చు. వడ్రంగి, కంసాలి పనిచేసేవారి జీవితాలు ఎలా ఉన్నాయో? ఎన్ని బాధలు అనుభవించారో అవగతమవుతాయి. కుటుంబాన్ని పోషించడానికి వాళ్లు పడ్డ కష్టాలు, భర్త ఆరోగ్యం దెబ్బతింటే ఇంటి మొత్తాన్ని సాకటానికి భార్య కష్టపడి పనిచేయటం, శ్రమసంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. వడ్రంగి, కంసాలి కులాలలో ఆడవాళ్లు పడే కష్టం, సొంత ఇల్లు లేక ఇంటి బయట పశువుల కొట్టాన్ని కొనుక్కొని జీవించిన తీరు, పుట్టుక దగ్గర నుంచి అడుగడుగున ఒక బహుజన కుటుంబం పడే కష్టాలన్నీ సోమాచారి కుటుంబంలో కనిపించాయి. ఒక సాధారణ వ్యక్తి జీవిత సంఘర్షణలోంచి మొదలైన అసాధారణ వ్యక్తిత్వం సోమాచారిలో కనిపిస్తుంది.
మోగులూరి సోమాచారి 1922 మే 22న కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోని పల్లెర్లమూడి గ్రామంలో జన్మించారు. తల్లి చాయమ్మ (చిట్టమ్మ). తండ్రి భద్రయ్య. ఆస్తి లేని కుటుంబం. రెక్కల కష్టంతో జీవించే బతుకులవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కాని డొక్క నిండని బడుగుజీవుల ఆత్మకథ సోమాచారి జీవితం. ఇలాంటి పేదరికం నుంచి ఎదిగిన వ్యక్తిలో సహజంగా ఉండే కసే సోమాచారిని విప్లవ రాజకీయాల వైపు మళ్ళించింది, ఆయనను ఉద్యమకారునిగా మార్చింది. ఈ సమాజంలో నేటికీ కోట్లాది మంది పడుతున్న కష్టాలు, కన్నీళ్లకు దర్పణంగా సోమాచారి జీవితముంది. అందుకే సోమాచారి ఆత్మకథ అంటే పేదోళ్ల ఆత్మకథ.
ప్రాంతమేదైనా, నేల ఏదైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఆకలి కేకలకు పరిష్కారం దొరికేంతవరకు పోరాటాలు ఉంటాయి. సోమాచారి జీవితమంతా పోరాటాలతోటే గడిచిపోయింది. చిన్నప్పటి బాల్యమంతా కష్టాలతోటే మొదలైంది. చదువుకోవలసిన బాల్యంలో చెరుకు తయారుచేసే పనిలోకి వెళ్లాడు. తండ్రిలేని కుటుంబంలో తల్లికి ఆసరాగా నిలుస్తూ కులవృత్తి కుంపటి వెంట పడి కంసాలి పని నేర్చుకున్నాడు. ఆభరణాలను తయారుచేశాడు. కూలి పనులకు పోయాడు. పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బ్రతుకు తెరువుకోసం ఆయనపడ్డ కష్టాలు అన్నీ యిన్నీ కావు. సామర్లకోటలో షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగస్తునిగా పనిచేశాడు. మా భూమి నాటకాన్ని చూశాడు. లోకం తీరు నాటకంలో నటించాడు. సోమాచారి మంచి నటుడు. సోమాచారి అనేక నాటకాలలో పాత్రధారుడు. బహుమతులను కూడా గెలుచుకున్నాడు. అదే సమయంలో బ్రతుకు పోరాటంలో నిలిచి గెలిచాడు. గెలిచి ఓడాడు. ఆయన సాధారణ విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి ఎదిగివచ్చి విశ్వ కుటుంబం కోసం నిలిచి పోరాడాడు. సమ సమాజం కావాలని ఎర్ర జెండా చేతపట్టాడు. తరిమెల నాగిరెడ్డి, చండ్రపుల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నండూరు ప్రసాదరావు, మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, తమ్మిన పోతరాజు, నెక్కలపూడి రామారావు, మానికొండ సుబ్బారావు, గుంటూరు బాపనయ్య, ఎ.వి.కె.ప్రసాద్, మానికొండ సూర్యావతి, పర్చా సత్యనారాయణ తదితరులతో కలిసి జైలు జీవితాన్ని, ఉద్యమ జీవితాన్ని గడిపాడు. అడవి ఉద్యమానికి, మైదాన ఉద్యమానికి మధ్యవర్తిగా నిలిచాడు. సికింద్రాబాద్ కుట్రకేసులో ఇరికించబడ్డాడు. అడవుల్లో తిరిగాడు. మన్యం పోరాటం దారుల్లో దీర్ఘకాలిక సాయుధ పోరాట జెండాను ఎగురవేస్తూ ముందుకు సాగాడు. గిరిజనులతో కలిసి పోడు ఉద్యమంలో పాల్గొన్నాడు. 8సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించాడు. సోమాచారి లాంటి బహుజన వ్యక్తిత్వాల వల్లనే పోరాటాలు అంత ఎర్రగా పండుతాయనుకుంటా.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటి కాలం(1938)లో ఆయన సామర్లకోటలో ఒక పార్టీ కార్యకర్తగా నిలిచాడు. ఆ రోజుల్లో సామర్లకోట పార్టీ కార్యదర్శిగా పనిచేశాడు. తాను పనిచేసే షుగర్ ఫ్యాక్టరీలో ఒక కార్యకర్తగా పనిచేశాడు. ప్రజాశక్తి పత్రికలు కడుపులో దాచుకుని కార్మికులకు చదివి వినిపించాడు. 1955లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించటంలో ఆయన కృషి ఎంతో ఉంది. సీపీఐ నుంచి సీపీఎం చీలిపోయిన తర్వాత 1967 అసెంబ్లీ ఎన్నికలలో సామర్లకోట నియోజకవర్గం నుంచి మార్క్సిస్టు పార్టీ తరఫున సోమాచారిని అభ్యర్థిగా నిలిపారు. సోమాచారి ఓడిపోయారు. అయినా తానెంచుకున్న పోరు మార్గాన్ని జీవితంలో విడవకుండా ఉన్నాడు. ఆయన పేదల పక్షాన నిలిచాడు. నోరులేని వారికి అండగా ఉన్నాడు. సోమాచారి చండ్రపుల్లారెడ్డి నేతృత్వంలోని సీపీఐఎంఎల్ పార్టీలో కొనసాగాడు.
సోమాచారి వ్యక్తిగత జీవితమంతా పల్లేరుగాయాలపై నడకలాంటిది. ఆయన జీవితంలో సుఖాలకు, సంతోషాలకు, విలాసాలకు తావులేదు. ఆయన జీవితమంతా ఒంటి చేత్తో కుటుంబాన్ని కాపాడుకుంటూ, తన జీవితంలోని సర్వస్వాన్ని సమాజం కోసమే అంకితం చేసిన మహోన్నతుడు. చాలామందికి రాజకీయాలు కూడా కలిసి వస్తాయి.
కొందరికి రాజకీయాలు కూడా ఆస్తిపాస్తులవుతాయి. కాని విప్లవ రాజకీయాల్లో వున్నవారికి జీవితం నేర్పే పాఠాలే మిగులుతాయి. వాళ్లే సమాజానికి పాఠాలుగా నిలుస్తారు. ఆదర్శం ఎంత ఉన్నతమైనదో దాన్ని ఆచరించటం ఎంత కరుకుగా ఉంటుందో సోమాచారి జీవితం చూస్తే తెలుస్తుంది. విప్లవాల కాలం ముగిసిందని మార్కెట్ సమాజం బల్లగుద్ది చెబుతుంది. సోమాచారి మాత్రం పీడితులు వున్నంత కాలం పీడకులపై విప్లవాలు జయించి తీరుతాయని ఖరాఖండిగా చెప్పేవారు.
సామర్లకోట అంటే విశాఖకు దగ్గరలోని ప్రఖ్యాతిగాంచిన రైల్వేస్టేషనగానే ప్రపంచానికి కనిపిస్తుంది. అక్కడి చరిత్రాత్మక షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు వస్తుంది. నాలాంటి వాళ్లకు, విప్లవోద్యమ స్పర్శ ఉన్న వాళ్లకు మాత్రం సామర్లకోటంటే సోమాచారి గుర్తుకు వస్తాడు. సోమాచారి ఆశయాల సాయుధపోరాటాలు గుర్తుకు వస్తాయి. సోమాచారి ఆశయాలు ఏ రూపంలో, ఎట్లా గెలుస్తాయో కాలమే చెబుతుంది. కానీ తన ఆశయ నిబద్ధతలో మాత్రం సోమాచారి గెలిచాడు. ఆయన ఆత్మకథను ఉద్యమకారులే కాదు, నిబద్ధత, నిమగ్నతలను ప్రేమించే ప్రతి ఒక్కరూ చదవాలి. సోమాచారి ప్రతిఘటనా దారుల్లో పుష్పిస్తాడు. విప్లవోద్యమ బాటల్లో ఒక మైలురాయిగా నిలుస్తాడు.
జూలూరు గౌరీశంకర్
కవి, సీనియర్ జర్నలిస్