అమెరికాలొని మేరీలాండ్ లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. మేరీలాండ్లోని గేతర్స్బర్గ్ హైస్కూల్ ఈ వేడుకలకి వేదికగా నిలిచింది. వర్జీనియా, మేరీలాండ్, డి.సి రాష్ట్రాలనుంచి వేయి మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
శుభప్రదమైన పంచాంగ శ్రవణముతో వేడుకలు మొదలైనాయి. స్థానిక బాలబాలికలు, మహిళల సంగీత, నృత్య ప్రదర్శనలు, ప్రముఖ డ్యాన్సర్ కళాధర్ నృత్యం మొదలైన కార్యక్రమాలు స్థానిక ప్రతిభను చాటిచెప్పాయి. ప్రముఖ విలువిద్యాపారంగతులు శ్రీ లింగంగుంట్ల సుబ్బారావు గారు తమ విలువిద్య ప్రదర్శనతో అందరినీ అలరించారు. ఆయన పాదలక్ష్య బేధనం, శబ్దబేధి, మత్స్య యంత్ర ఛేదనం లాంటి విద్యలు ప్రదర్శిస్తుంటే ఆహ్వానితులు ఆశ్చర్యానందాలకు గురయ్యారు. స్థానిక బాలబాలికలు (ష్యాంటిలీ) కన్యాశుల్కం నాటకం ప్రదర్శించారు. స్పృష్టమైన ఉచ్ఛారణతో, చక్కని హావభావాలతో కూడిన బాలల నటన మరుగుపడుతున్న తెలుగు నాటక రంగానికి చక్కని ఆశాకిరణం. సత్యనారాయణ మన్నే, అవినాష్ కాసా వారి బృందంతో కలిసి నిర్వహించిన “మీలో ఎవరు బంగారయ్య?” కార్యక్రమం ఆహూతుల విజ్ఞానాన్ని పరీక్షిస్తూ ఆసక్తిదాయకంగా సాగింది.
GWTCS సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర Special Representative కోమటి జయరాం గారిని ఘనంగా సత్కరించారు. తానా అధ్యక్షులు జంపాల చౌదరి గారు, సతీష్ వేమన గారు, గంగాధర్ నాదెండ్ల గారు కోమటి జయరాం గారి సేవానిరతిని, వ్యవహార దక్షతను కొనియాడారు. కోమటి జయరాం గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, NRI ల మధ్య సంధానకర్తగా తన వంతు బాద్యతను నిర్వహిస్తానని, NRI లు కూడా తమ జన్మభూమికి సేవ చేయగల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
GWTCS అధ్యక్షులు కిషోర్ దంగేటి, కార్యవర్గ సభ్యులు సత్యన్నారాయణ మన్నె, సుధా పాలడుగు, తనుజ గుడిసేవ, చంద్ర మాలవతు, అనిల్ ఉప్పలపాటి, సురేష్ మారెళ్ళ, కృష్ణ లామ్, రామకృష్ణ చలసాని, రాకేశ్ బత్తినేని, లాక్స్ చేపురి, శ్రీధర్ మారం, అశోక్ వాసం, కవిత బాల, ప్రసాద్ రెడ్డి మందపాటి ఆహూతులందరికి ధన్యవాదాలు తెలియచేశారు. తానా, ఆటా, కాట్స్, టామ్, వారధి, నాటా, తాటా, TDF, VT ప్రతినిధులు మరియు GWTCS పూర్వ అధ్యక్షులు ఈ వేడుకలలో పాల్గొని తెలుగువారి మధ్య ఉన్న సామరస్యాన్ని చాటిచెప్పారు.
GWTCS పత్రిక “వార్తావాహిని” ని జంపాల చౌదరిగారు విడుదల చేశారు. వార్తావాహిని సంపాదకురాలు సాయికాంత రాపర్ల గారు మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ పత్రికని పునరుద్ధీకరించటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.