నారాయణ భట్టు

నన్నయ సమకాలికునిగా ప్రసిద్దుడైన నారాయణ భట్టు 11వ శతాబ్దం వాడు . ఈయనకు కరీభ వజ్రాంకుడు అనే బిరుదు కలదు. ఈయన బహు భాషా కోవిడునిగాను, ఉద్దండ పండితునిగాను పేరు తెచ్చుకున్నాడు. ఇతని పాండిత్యాన్ని గుర్తించి రాజరాజ నరేంద్రుడు నందంపూడి దాన శాసనాన్ని లిఖింపజేసి ఆ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు . ఈ శాసనమే భట్టు గురించిన పూర్తి వివరాలు తెలియజేస్తుంది. క్రీ.శ.1022 నుండి 1063వరకు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని వెంఘీ దేశాన్ని పాలించిన తూర్పుచాళుక్య చక్రవర్తి రాజరాజనరేంద్రుడు నారాయణభట్టుకు ఇచ్చిన నందంపూడి అగ్రహారం కోనసీమలోనిదేనని నందంపూడి శాసనం తెలుపుతుంది. అందులో పేర్కొన్నట్లు రెండేరుల నడియదేశం అంటే గౌతమీ, వైనతేయ నదులమధ్య ఉన్న అంబాజీపేటలోని నందంపూడి అని చెబుతారు.

వేణీ సంహారము నాటక రచయిత. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంత వాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.

నారాయణభట్టు నన్నయకు సహాధ్యాయుడు అట. నారాయణభట్టు తనకు చేసిన సహాయాన్ని కీర్తిస్తూ నన్నయ చెప్పిన పద్యం –

పాయక పాక శాసనికి భారత ఘోరరణంబునందు నా
రాయణునట్లు వాణస ధరామర వంశ విభూషణుండు నా
రాయణభట్టు వాఙ్మయ ధురంధరుఁడుం దనకిష్టుఁడున్ సహా
ధ్యాయుడునైన వాఁడభిమత స్థితిఁ దోడయి నిర్వహింపగన్

నారాయణభట్టు ఎలాంటి సాయం చేశాడనే విషయంపై వివిధాభిప్రాయాలున్నాయి. వారు జంటకవులని కూడా కొందరంటారు. అయితే అది నిరాధారమని చెబుతూ పింగళి లక్ష్మీకాంతం ఇలా భావించాడు – “ఆయుధం పట్టకుండా కృష్ణుడు అర్జునునికి సాయం చేసినట్లే తాను స్వయంగా ఘంటం పట్టకుండా నారాయణభట్టు నన్నయకు తగిన సూచనలు ఇచ్చి ఉండవచ్చును. ఏ ప్రకరణం ఎలా పెంచాలి, కుదించాలి, సంస్కృతభారతాన్ని తెలుగులోకి ఎలా చేయాలి వంటి సముచితమైన సంప్రదింపులు వారిమధ్య జరిగి ఉండవచ్చును. గ్రంధారంభం నుండి తనకు చేదోడు వాదోడుగా సహాయపడుటనుబట్టియే నన్నయ కృతజ్ఞతాపూర్కంగా పై పద్యాన్ని చెప్పాడు. ఇది ఎంతో సార్ధకమైన పద్యము.”

నారాయణభట్టుకు రాజరాజనరేంద్రుడిచ్చిన నందంపూడి అగ్రహారం శాసనాన్ని నన్నియభట్టే వ్రాశాడు. అందులో “సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషా సుకవి రాజశేఖర ఇతి ప్రథిత సుకవిత్వ విభవేన్” అని నారాయణభట్టుగురించి చెప్పాడు

ఇతర లింకులు : https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3_%E0%B0%AD%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81

 

images: telugubooks.in and wikimedia.org