నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన.. నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ.. పుట్టిన నేల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆ ఆధునిక రుషి పేరే రామోజీరావు.
ఆయన ఒక్కొక్క చెమట చుక్కా చిందించి.. పగలూ రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్!
ప్రత్యక్షంగా పాతిక వేల మందికీ పరోక్షంగా అనేకానేక మందికీ ఉపాధి కల్పిస్తున్న మహాసంస్థ. నిత్యం ఉషోదయంలో సత్యం నినదించుగాక అంటూ తెలుగువాకిళ్ల వెలుగుచుక్కలా ప్రభవించే ‘ఈనాడు’ నుంచి క్షణంక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ‘ఈటీవీ’ వరకూ దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే ‘అన్నదాత’ నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిలిం స్టూడియో ప్రాంగణం ‘రామోజీ ఫిలింసిటీ’ వరకూ.. అన్నీ ఆయన ఒడిలో బడిలో పుట్టిన బిడ్డలే.
రామోజీరావు ఏం చేసినా విలక్షణంగా చేస్తారు. విలువలతో చేస్తారు అని తెలుగు ప్రజ మాత్రమే కాదు.. యావద్భారతం మనసారా నమ్ముతుంది. ఆయన అడుగులో అడుగు కదుపుతుంది. జీవన గమనాన్నే ఒక ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు 1936 నవంబర్ 16న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. కృష్ణా జిల్లాలోని ఒక మామూలు పల్లెటూరులో పడిన ఆయన అడుగులు.. చేలగట్ల మీద చిగురించిన ఆ వ్యక్తిత్వం క్రమక్రమంగా ఎదుగుతూ ఎదురొచ్చిన సవాళ్లను అధిగమిస్తూ మునుముందుకు సాగింది.
1962లో ఆయన ప్రారంభించిన మొట్టమొదటి వ్యాపార సంస్థ మార్గదర్శి చిట్‌ఫండ్స్. అతి చిన్నగా ప్రారంభమైన మార్గదర్శి అనతికాలంలోనే అంచెలంచెలుగా విస్తరించింది. ప్రజలు ఈ సంస్థపై చూపించిన నమ్మకం అపారం. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం.. ఈ రెండూ మార్గదర్శికి రెండు మంత్రాక్షరాలు. అందుకే ఈరోజు మార్గదర్శి 105 శాఖలతో, 4300 మంది సిబ్బందితో, లక్షలాది సభ్యులతో, 7750 కోట్ల రూపాయల టర్నోవరుతో తిరుగులేని సంస్థగా వెలుగుతోంది.
మార్గదర్శిని విజయపథంలో నిలిపాక మట్టివాసనను మరచిపోలేని రామోజీరావు.. 1969లో అన్నదాత మాసపత్రికను ప్రారంభించారు. పల్లెటూరిలోని భూమిని అమ్మి వ్యాపారం ప్రారంభించిన తాను ఆ పల్లెటూరికి ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలని సంకల్పించారు.
నాగేటిచాళ్లలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొలకెత్తాలన్న ఆశతో ఆకాంక్షతో అన్నదాత పత్రికను తీర్చిదిద్దారాయన. ఈరోజు 3 లక్షల మంది వార్షిక చందా చెల్లించి అన్నదాతను ఆదరిస్తున్నారంటే ఆ పత్రిక ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆగస్టు 10, 1974న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ఆరంభించిన ‘ఈనాడు’ తెలుగునాట ఒక సమాచార సంచలనాన్నే సృష్టించింది. అణువణువునా కొత్తదనాన్ని విరజిమ్ముతూ ప్రజల పక్షాన అక్షర యుద్ధాన్ని ప్రకటించిన ఈనాడు దినపత్రిక ప్రారంభించిన నాలుగేళ్లలోనే అత్యధిక పాఠకుల అభిమాన పుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే ఈనాడు ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. పరిశోధనా పాత్రికేయం ప్రారంభమైంది ఈనాడుతోనే.
ప్రతి జిల్లాకూ ఒక ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు కాగడాలెత్తింది ఈనాడు. రామోజీరావు ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక పుటను అక్షరాలబాట పట్టించిన ఘనత, చరిత ఈనాడుదే. ఆనాడు అతికొద్ది ప్రతులతో ప్రారంభమైన ”ఈనాడు”.. ఈనాడు పత్రికా రంగానికే తలమానికంగా భాసిల్లుతోంది.
1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సమరశంఖం పూరించి కలం బలం ఏపాటిదో లోకానికి చూపించారాయన. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్థాయిలో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కావడం మరో మచ్చుతునక.
వెండితెరపై కూడా రామోజీరావు తన ముద్రను వేసి సినిమా అంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదనీ మనసుని కదిలించే బొమ్మలనీ నిరూపించారు. ఉషాకిరణ్‌మూవీస్ సంస్థను స్థాపించి 87 సినిమాలను వివిధ భాషల్లో నిర్మించి తన చిత్రాలు చైతన్యదీపాలనీ ప్రగతి రథచక్రాలనీ ఎలుగెత్తారు. ఒక ప్రతిఘటన, ఒక మయూరి, ఒక మౌనపోరాటం, ఏ సినిమా తీసుకున్నా ఒక ప్రయోగమే. ఒక పెను సంచలనమే. ఆయన చిత్రాలలో ఎప్పుడూ కొత్తవారికే పెద్దపీట. ఉషాకిరణ్మూవీస్లో పుట్టిన ఎందరో నటీనటులూ సాంకేతికనిపుణులూ దర్శకులూ నేడు అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు. తమ బాణీ చూపిస్తున్నారు.
సినీ పరిశ్రమకే కాదు, పర్యాటక రంగానికీ రామోజీరావు అందించిన మరో మహాద్భుతం.. రామోజీ ఫిలింసిటీ. సినీ నిర్మాణానికి కావాల్సిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూలతోటలూ కళ్లు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారినీ మంత్రముగ్ధుల్ని చేసే రామోజీఫిలింసిటీ గిన్నిస్‌బుక్‌లో తన పేరును నమోదు చేసుకుందంటే.. ముందుగా తలచుకోవాల్సిన పేరు రామోజీరావుదే!
1995లో ఆయన స్థాపించిన ఈటీవీ.. అనతికాలంలోనే తెలుగుప్రజల గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది. ఈటీవీ నెట్‌వర్క్‌గా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగులోగిళ్లకు శరవేగంతో వార్తలను చేరవేసేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచారానికి వేదికలుగా తీర్చిదిద్దారు రామోజీరావు.
ఈటీవీ ప్లస్.. ఈటీవీ సినిమా.. ఈటీవీ అభిరుచి.. ఈటీవీ లైఫ్ ఛానళ్లకు రూపకల్పన చేసిందీ రామోజీరావే. ఈ రోజు తెలుగు టెలివిజన్ రంగంలోనే ఈటీవీ అగ్రస్థానంలో నిలిచిందంటే అందుకు కారకులు ప్రేరకులు ఆయనే. రామోజీరావు మదిలోంచి మొగ్గతొడిగిన సంస్థలెన్నో నేడు ప్రగతిదారిలో దూసుకుపోతున్నాయి. 1980లో ప్రారంభించిన ప్రియాఫుడ్స్ ఇప్పుడు 22 దేశాలలో ప్రజలకు ప్రియమైన రుచులు అందిస్తోంది. ఆతిథ్య రంగంలో అద్వితీయ స్థానం పొందిన డాల్ఫిన్ హోటల్స్, చిత్రరంగ విశేషాల సుమమాలిక సితార, సాహితీరంగంలో విశేషసేవలందిస్తున్న విపుల, చతుర ఇవన్నీ రామోజీరావు కృషి ఫలితాలే.
మాతృభాషంటే రామోజీరావుకు ఎక్కడలేని మమకారం. అమ్మభాష అంతరించకుండా అరచేతులు అడ్డంపెట్టి తల్లిపాల రుణం తీర్చుకునేందుకు తెలుగు వెలుగు పత్రికను జాతికి అందించారాయన. అలాగే పిల్లల మనస్సుల్లో వినోద విజ్ఞాన కాంతులు చిమ్మేందుకు బాలభారతం పత్రికను ఆరంభించారు. బాలలు మన సంస్కృతీ మూలాలను మరచిపోరాదన్నది ఆయన ప్రగాఢ భావన.
తన చుట్టూ ఉన్న సమాజం కష్టంలో నష్టంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నేనున్నాంటూ నడుంకట్టి తోటివారి కన్నీటిని తుడిచేందుకు ఎప్పుడూ ముందువరుసలోనే ఉన్నారు రామోజీరావు. నాడు దివిసీమలో ఉప్పెన ఉత్పాతమై విరుచుకుపడినా కృష్ణా నది ఉగ్రతాండవం చేసి కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలను కుదిపేసినా గుజరాత్లో భూకంపం ప్రళయతాండవం చేసినా సునామీ తాకిడికి దక్షిణాది తీరప్రాంతమంతా చిగురుటాకులా వణికినా విశాఖలో హుద్‌హుద్ తుపాను విలయం సృష్టించినా ఆర్తుల కోసం అడుగు ముందుకు వేశారు రామోజీరావు. మరుక్షణమే స్పందించి తక్షణ, శాశ్వత సహాయ కార్యక్రమాల కోసం మానవతా దీపాలు వెలిగించి స్ఫూర్తిగా నిలిచారు.
ఆయన కృషి అసాధారణం. ఆ దీక్షాదక్షతలు అద్వితీయం. కాబట్టే ఎన్నో పత్రిష్ఠాత్మక సంస్థలు ఆయనకు ప్రత్యేకంగా అవార్డులు అందించాయి. 1986లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీనీ, 1989లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌నూ ప్రదానం చేశాయి. ఇటీవలే శ్రీశ్రీ యూనివర్సిటీ సైతం ఆయనకు డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని సత్కారాలు వరించినా సాధించిన దానితో రామోజీరావు ఎప్పుడూ పొంగిపోలేదు. సంతృప్తిపడలేదు.
ఇంకా ఏదో చేయాలన్న తపన. అదే ఒక తపస్సు. నిరంతరం పనిలోనే విశ్రమించే రామోజీరావును భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించడం సాటిలేని కృషీవలుడికి సముచితమైన గౌరవం!
Source: EENADU