తెలుగులోని కస్తూరి వాసన చక్కర పాకం.. అరవ భాషలోని అమృతరాశి.. కన్నడంలోని కస్తూరి వాసన..అంటూ ఇతర భాషల్లోని గొప్పదనాన్ని తనలో ఇమిడింపజేసుకున్న గొప్పదనం తెలుగుభాషది అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత తెలుగుభాష గొప్పదనాన్ని, విశిష్టతను ఇలా కవిత రూపంలో వినిపించారు. మలేషియాలోని తెలుగు వారందరికీ దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ సుఖ సంతోషాలు కలగాలని కవిత ఆకాంక్షించారు. ఉగాది అంటే ఒక యుగాన్ని ప్రారంభించిన రోజుగా.. బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు అని చెప్పారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా ఉగాది పండుగ రోజు రెండు విషయాలు మర్చిపోరు. ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం మొదటిది అయితే, భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం రెండోది అని అన్నారు.
తెలుగు ప్రజల ఉన్నతికి అన్ని విధాల సహకారం అందిస్తామని ఎంపీ కవిత అన్నారు. తెలుగు భాషను గత 150 ఏళ్లుగా కాపాడుకొనేందుకు మలేషియాలోని తెలుగువారు ప్రాణాలొడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. మలేషియాలోని తెలుగు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. మలేషియాలోని తెలుగు కార్మికులను వారి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హోంమంత్రి ఇక్కడి వచ్చారని గుర్తు చేశారు. రెండు రాష్ర్టాల్లోని సీఎంలు సైతం తెలుగువారిని కాపాడుకునేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆశావహ ధృక్పథంతో ముందుకెళ్తున్నారని.. వారి సహకారంతో తెలుగువారిని కాపాడుకుంటామన్నారు. మలేషియా ప్రభుత్వం చొరవ చూపి తెలుగువారి పండుగను ఘనంగా నిర్వహించడం చరిత్రాత్మకం అన్నారు. ఈ సందర్భంగా మలేషియా ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు సినిమాలపై మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో విలువలు పడిపోతున్నాయి. ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడుతుండటం బాధాకరమే అయినా, మలేషియాలోని తెలుగువారు తెలుగు సినిమాలు చూసి భాషను నేర్చుకోవడం సంతోషంగా ఉన్నది అని అన్నారు. తెలుగు భాషను విదేశాల్లో నిలబెడుతున్న తెలుగు సినిమాలు వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మలేషియా ముఖ్యమంత్రి దాతోశ్రీ మోద్నజీబ్ తున్హజి అబ్దుల్ రజాక్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ అచ్చయ్య ప్రసాద్‌రావు, సుధాకరన్, వరంగల్ కార్పొరేటర్ విజయ్‌భాస్కర్, ఎంఎస్ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీ బాలాజి సింగ్, నిజామాబాద్ నుంచి రహీమ్ పాల్గొన్నారు.
source: http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/telugu-language-is-unique-1-2-508045.html