ఉగాది నాడు మండుటెండలో తెలుగుతల్లి ఆవేదన దీక్ష చేసిన యార్లగడ్డ

yarlagaddaతెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ హిందీ, తెలుగు పండితుడు, విద్యావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవేదన దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మండుటెండలో ఆయన ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పుష్కరాల ముగింపు ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానం చేతల్లో ఇంతవరకు అమలు చేయకపోవటం బాధాకరమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన అనంతరం పాఠశాల స్థాయి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో విద్య, ప్రభుత్వ పాలన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే కొనసాగిస్తామని, తెలుగుభాషా పీఠం ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో లేవన్నారు. ప్రతి జిల్లాలో అత్యున్నత స్థాయిలో పురవేదికలు నిర్మిస్తామని, తెలుగును రెండో జాతీయభాషగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారన్నారు. బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపినా, ఇంతవరకు ఎలాంటి చర్యలూ లేవన్నారు. తెలుగుతల్లి ఆవేదన ప్రభుత్వానికి వినిపించేందుకు ఆవేదన దీక్ష చేస్తున్నామని, ఇందులో ఎలాంటి డిమాండ్లూ లేవన్నారు. ఇప్పటికైనా తెలుగుభాషకు ప్రత్యేక గుర్తింపునివ్వాలని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కోరారు. ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు హాజరై యార్లగడ్డకు మద్దతు పలికారు.

తెలుగు రాష్ట్రంలోనే తెలుగు భాషకు న్యాయం జరగలేదని నిరాహార దీక్ష చేపట్టిన యార్లగడ్డకు మాత్రమే తెలుగు ఆవేదన లేదని.. తెలుగు వారంతా తెలుగు భాషా పరిరక్షణ కోసం ముందుకు రావాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. మాతృభాష కోసం సొంత రాష్ట్రంలోనే నిరాహార దీక్ష చేపట్టడమంటే ఇంతకంటే అవమానం మరొకటి లేదన్నారు.

‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అని పొద్దున లేస్తే పాడుకునే రాష్ట్రంలో తెలుగు అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు అమలు కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. తెలుగు భాష అమలు కోసం చంద్రబాబు హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని యార్లగడ్డ అంటున్నారు.

ఇకపోతే.. తెలుగు భాషకు అన్యాయం జరుగుతున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భాషా పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగపూర్‌, జపాన్‌, చైనా మత్తులో ఉన్న చంద్రబాబు పూర్‌ లాంగ్వేజ్‌ తెలుగును పట్టించుకోవడమా? అద్భుతమైన రాజధాని నిర్మిస్తానని యమ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు అమ్మ భాషను అమలు చేస్తానని ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు లేవు.

‘అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నికి గాజులు చేయిస్తానన్నాడు’ అన్న సామెతలా అమ్మ భాషను అటకెక్కించిన చంద్రబాబు యువతీ యువకులంతా జపాన్‌ భాష నేర్చుకోవాలని కోరారు. ఎందుకు? జపాన్‌ వాళ్లు ఆంధ్రలో పరిశ్రమలు, పెద్ద సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతోనేనని విశ్లేషకులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు మర్చిపోయిన అనేక హామీల్లో తెలుగు అమలు ఒకటి. ఇందుకు అమరావతి రాజధాని పలకం పూర్తిగా ఆంగ్లంలో రాసి వుండటమే నిదర్శనం. తాత్కాలిక సచివాలయం కమ్‌ అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేసినప్పుడు శిలాఫలకం ఇంగ్లీషులోనే ఉంది. ఈ చర్యలను యార్లగడ్డ ప్రశ్నించారు.

అమరావతిలో అన్ని వ్యవహారాలు ఆంగ్లంలోనే జరుగుతునన్నాయని, తెలుగు కనబడటంలేదని యార్లగడ్డ ఆవేదన చెందారు. ఆమధ్య ఆంధ్రా అసెంబ్లీలో ఆంగ్లంలో బడ్జెటు ప్రతిని చదవిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని విమర్శించిన యార్లగడ్డ తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను అభినందించారు. ఎందుకంటే ఆయన బడ్జెటు ప్రతిని తెలుగులో చదివారు కాబట్టి. యనమల ఆంగ్ల ప్రసంగంతో తలదించుకున్న తాము, ఈటెల ప్రసంగంతో తలెత్తుకున్నామని అన్నారు.

ఇదిలా ఉంటే.. సొంత రాష్ట్రంలోనే తెలుగు అమలుకు దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇక ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషకు ఏర్పడే అవమానానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సాహితీ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో తెలుగు భాషను పూర్తిగా లేకుండా చేసేందుకు నిర్భంధ తమిళం కోసం చర్యలు చేపట్టారు. అయితే పదో తరగతి పరీక్షలు ఇతర భాషలు చదువుతున్న విద్యార్థులు వారి వారి భాషల్లోనే ఈ ఏడాది పరీక్షలు రాశారు.

అయితే తెలుగు భాష మెల్ల మెల్లగా కనుమరుగవుతుందని.. ఆ భాషను ఆదరించే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ఒకవైపు విద్యార్థులు కరువవుతుండగా.. వాటి సాకుతో తమిళనాడులోని కళాశాలల్లో గల తెలుగు శాఖలను మూతవేసేందుకు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు నిద్ర మేల్కొని సొంత రాష్ట్రంలో తెలుగు అమలుకు.. పక్క రాష్ట్రంలో తెలుగు భాషా పరిరక్షణకు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

సేకరణ : ఈనాడు, వెబ్ దునియా , ఆంధ్రజ్యోతి 

Leave a Comment