గూడ అంజయ్య – Guda Anjaiah

guda anjayyaఆయన పాటలు ఆయుధాలు.. ఆ పాటల్లో పదాలు దూసుకుపోయే తూటాలు! సామాజిక ఉద్యమాలకు, ప్రగతిశీల శక్తులకు తిరుగులేని అస్ర్తాలు! ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణాలను దర్శించినా.. ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా అంటూ ఊరుమ్మడి బతుకుల్ని ఏకంచేసి.. దొరపై తిరుగుబాటుకు పురికొల్పినా.. భద్రం కొడుకో.. అంటూ రిక్షా కార్మికుడిని అప్రమత్తం చేసినా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ప్రభుత్వవైద్యం గుల్లతనాన్ని నిలువునా కడిగేసినా.. అవ్వోడివా నువ్వు అయ్యోడివా.. తెలంగాణోనికి తోటి పాలోడివా? అని నిగ్గదీసినా..తెలంగాణ గట్టు మీద సందమామయ్యలను అబ్బురంగా ఆస్వాదించినా.. ప్రతి పల్లవిలో.. ప్రతి చరణంలో అచ్చు తెలంగాణ యాస! ఆసాంతం కష్టజీవి గోస.. అందులోనే తిరుగుబాటు కాంక్ష! తెలంగాణ సాకారం కావాన్న బలమైన ఆకాంక్ష! అదే గూడ అంజయ్య పాట! ఏ రోగానికి వైద్యుడు ఏ మందు రాస్తాడో వృత్తిరీత్యా సంపాదించిన అనుభవంతో అక్షరాలనే ఔషధాలుగా చేసి.. జనం దరికి చేర్చిన సామాజిక వైద్యుడు!
ఆయనే గూడ అంజయ్య ! గూడ అంజయ్య రచయితగా, పాటగాడుగా ప్రజా ఉద్యమ కార్యకర్తలకు సుపరిచితుడు.
ఆయన ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి మండలం, లింగాపురం గ్రామానికి చెందినవాడు. ఆయన లక్ష్మమ్మ,లక్ష్మయ్య దంపతులకు 1955లో జన్మించాడు.ఆయనకు ఐదుగురు సహోదరులున్నారు. ఆయన ప్రాథమిక విద్యను లింగాపురం గ్రామం లో చదివారు.కొంతకాలంగా కామెర్లు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం 21 జూన్ 2016 రంగారెడ్డి జిల్లా రాగన్నగూడ లోని స్వగృహంలో ప్రాణాలు విడిచాడు.

నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా ఎన్నో కథలు, పాటలు రాసిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు రాశారు. వీటన్నింటికి తోడు సినిమాల్లో పాటలు రాసిన తర్వాత తెలుగు నేల నలుమూలలా ఆబాలగోపాలం అందరి నోళ్లలో నానుతున్నాడు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేశాడు. ఆయన పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వైద్యం చేయడానికి ముందుకు వచ్చింది. ఆయన వ్రాసిన “ఊరు మనదిరా” పాట 16 భాషలలో అనువాదమయింది.ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసాడు.

40 ఏండ్లసాహితీ జీవితంలో కవిగా, రచయితగా అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు, కథలు రాశారు. అనేక విప్లవ, అభ్యదయ, ప్రగతిశీల సినిమాలకు ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఊరు మనది రా.. ఈ వాడ మనదిరా.. అనే పాట పదహారు భాషల్లోకి తర్జుమా అవ్వడం ఆ పాటకున్న గొప్పతనాన్ని చెప్పకనే చెప్తున్నది. 1980లలో హైదరాబాద్‌లో జరిగిన ఆసియా-ఆఫ్రికన్ దేశాల రచయితల సదస్సులో ఈ పాటను ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అప్పటికప్పుడే వారి భాషలలోకి అనువాదం చేసుకొని పాడుకున్నారు. ఊరిడిసి నే పోదినా, చెరువులో దూకనా, చెరువయ్యిపోదునా, అంటూ తెలంగాణ ప్రజల ఇబ్బందులను పాటలను చేశారు. నల్లగొండను సందర్శించినప్పుడు ఆయన మోట రైతులదగ్గరనే తిని నిద్రచేసేవారు. ఆ సందర్భంలోనే అసిలేటికార్తెలో ముసలెడ్లు కట్టుకొని మోకాటి బురదల్లో దుక్కులే దున్నితే గరిశెలెవరివి నిండెరో.. అంటూ ఆశువుగా పాట రాశారు. గూడ ఆంజయ్య రాసిన చాలా పాటలు అన్నీ భారతీయ భాషలలోకి అనువాదాలయ్యాయి. సినిమాల రూపంలో అయితేనేమి.. స్వరాష్ట్ర సాధన పోరుకోసమైతేనేమి.. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సాహితీ అస్ర్తాలు అనన్యమైనవి. తెలంగాణ ఉద్యమానికి సాహిత్యపరంగా ఆయనరాసిన పాటలు ఆక్సిజన్‌గా మారి ప్రాణం పోశాయంటే అతిశయోక్తికాదు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తెగ గోండుల కోసం వారి భాష నేర్చుకుని వారి భాషలోనే పాటలు పాడిన సృజనశీలి అంజయ్య. నక్సల్బరీ ఉద్యమానికి ఆయువుపట్టువంటి పాటలను రచించారు.
ఆదిలాబాద్ జిల్లాతో గూడ అంజయ్యకు వీడదీయలేని అనుబంధం ఉంది. వైద్యారోగ్య శాఖలో ఫార్మసిస్టుగా పని చేస్తునే ఉద్యమ గీతాలను ఎన్నో రచించారు. జిల్లాలోని ఉట్నూరు, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అంజయ్య కలం కొత్త పుంతలు తొక్కింది. ఆయన ప్రధాన రచనావ్యాసాంగం, పాటల పల్లవులు అన్నీ హైదరాబాద్ రోడ్లమీదనే వెల్లువెత్తాయి. 2012లో లలితకళాతోరణంలో జరిగిన ధూంధాం దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని తన పాటలతో తెలంగాణలో విప్లవకెరటాలను సృష్టించారు.సాహిత్యకళాక్షేత్రంలోని మేధావులందరూ నిర్వచించిన దందహ్యమాన దశాబ్దం 1970-80ల మధ్యకాలంలో పాటలను రణన్నినాదాలుగా మోగించిన విప్లవకవి గూడ అంజయ్య.
మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, జయశంకర్‌లతో కలిసి నడిచారు. కాళోజీ, సదాశివ, రామశాస్త్రివంటి మేధావులతో చర్చలు జరిపారు. ప్రజల విప్లవ ఆకాంక్షలను కవులు, రచయితలు తమ రచనల ద్వారా ముందుగా ప్రకటిస్తారని, అ తర్వాతనే ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతాయన్న చారిత్రక సత్యానికి అంజయ్య మొక్కవోని నిదర్శనం. కవులను, కళాకారులను గౌరవించే పాలకులే ప్రజాస్వామిక పాలకులని తుదిశ్వాస వరకు తన విశ్వాసాన్ని ప్రకటించిన కలంయోధుడు ఆయన.
ఆధునిక విప్లవ వాగ్గేయకారుడిగా తెలుగు సాహిత్య చరిత్రలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న గూడ అంజయ్య కలం నుంచి వెలువడిన నవల ” పొలిమేర “. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల నేపథ్యంలో విప్లవ విద్యార్థి నాయకుడు, ప్రజాగాయకుడు ” గోపి ” అన్న ప్రధాన పాత్రను కేంద్ర బిందువుగా తీసుకుని ఆనాతి సామాజిక, రాజకీయ పరిణామాలను చక్కటి కథా కథనంతో అంజన్న ఆవిష్కరించాడు.

జీవితాన్ని, సమాజాన్ని, మానవ మనస్తత్వాల్ని లోతుగా అధ్యయనం చేసిన ఒక చింతనాపరుడిగా రచయిత ఈ నవలను నడిపాడు. నవలలో ఎక్కడా మహోపన్యాసాలు లేవు. కృత్రిమమైన సాహసకృత్యాలు లేవు. ఒక జీవితం కళ్ళముందు సీదాసాదా సజీవ స్రవంతిలా ప్రవహించుకుంటూ పోతుంది. మానవ సంబంధాలు, రాజ్యహింస, బూటకపు ఎదురుకాల్పులు, యువకుల అక్రమ నిర్బంధాలు, విప్లవోద్యమ నిర్మాణంలో మొక్కవోని ధైర్యంతో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నమ్మిన విశ్వాసాల కోసం అంకితమై పనిచేస్తున్న శ్రమజీవుల త్యాగాల వంటి ఎన్నో విషయాలను ఈ నవల నేటి తరానికి పరిచయం చేస్తుంది.

కథారచనలోనూ, నవలా నిర్మాణంలోనూ రాటు దేలిన రచయిత మాత్రమే రచించగల సంవిధానంతో గూడ అంజన్న రాసిన ఈ నవల నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

ఆయన రచనలు

  •  పొలిమేర (నవల)
  • దళిత కథలు (కథాసంపుటి)

ఆయన పాటలు

  • నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు
  • జర భద్రం కొడుకో కొడుకో కొమరన్న
  • ఊరు మనదిరా ఈ వాడ మనదిరా
  • అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా?
  • రాజిగా ఓరి రాజిగా

Sources:
https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%82%E0%B0%A1_%E0%B0%85%E0%B0%82%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF

http://brightelangana.com/guda-anjaiah-passed-away/
http://www.nizamabadnews.in/2016/06/22/telangana-poet-and-lyricist-guda-anjaiah-passes-away/

http://brightelangana.com/guda-anjaiah-passed-away/