తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

ఫిరంగిపురం : నాటకం జనజీవన స్రవంతిలో మమేకమై సామాజిక చైతన్యానికి ఊపిరి పోస్తుందని అభినయ నాటక కళా పరిషత్‌ అధ్యక్షుడు వంకాయలపాటి శివరామకృష్ణయ్య అన్నారు. శనివారం రాత్రి 11వ అభినయ నాటక కళా పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాటక పరిషత్‌ వ్యవస్థాపకుడు అభినయ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నాటకంపై ఉన్న విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని పొనుగుపాడు గ్రామంలో నాటక పరిషత్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో శ్రీఆంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు గుంటుపల్లి తులసీధరరావు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
డబ్బుకు ఆశ పడితే..
పరాయి డబ్బుకు ఆశ పడితే ఫలితం శూన్యమని తెలియజెప్పిన ఇల్లాలి ముచ్చట్లు నాటిక మొదటి ప్రదర్శనగా జరిగింది. భార్య, భర్తల మధ్య డబ్బు బంధం తప్ప సమన్వయం లేకుంటే నరకప్రాయమని పేర్కొంది. భర్త పేరుతో వ్యక్తి చనిపోతే ఆ డబ్బును తెచ్చుకొని భర్తను భార్య చులకనగా చూస్తుంది. సినిమా వ్యామోహంతో తమ్ముడు అక్కను మోసం చేసి డబ్బు, నగలతో ఉడాయించగా తదుపరి వచ్చే కష్టాలను సందేశాత్మకంగా వివరించింది. ఈ నాటికను కళాంజలి హైదరాబాద్‌ వారు ప్రదర్శించగా రచన యక్కాల కామేశ్వరయ్య, దర్శకత్వం కొల్లా రాధాకృష్ణ అందించారు.
కలిసి ఉంటేనే సౌందర్యం
రెండో ప్రదర్శనగా శ్రీమూర్తి కల్చరల్‌ అసోసియేషన్‌ కాకినాడ వారి రచన స్నిగ్ధ, దర్శకత్వం డాక్టర్‌ సీఎస్‌ ప్రసాదు అందించారు. తల్లిదండ్రులు వారి సరాదాలు మానుకుని పిల్లలకు ఎటువంటి కష్టం తెలియకుండా ఉన్నతంగా పెంచారు. కుమారుడు భార్య విధేయుడై డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చి తల్లిదండ్రులను కట్టుబట్టలతో నడిబజారులో నిలబెడతాడు. కుటుంబం అంతా కలిసి ఉండటమే సౌందర్య భారతమని సందేశమిచ్చిన నాటిక. 

Source: http://www.andhrajyothy.com/Artical?SID=227919

Leave a Comment