పర్యాటక, సాహిత్య కేంద్రంగా పోతన జన్మస్థలం

మహాభాగవత రచయిత, తెలంగాణ కవి బమ్మెర పోతన జన్మస్థలం పర్యాటక సాహిత్య కేంద్రంగా మారనుంది. వరంగల్ జిల్లాలోని ఈ ప్రాంతంతోపాటు పాలకుర్తి, వల్మిడిలను కూడా పర్యాటక సాహిత్య కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. డిప్యూటీ సీఎం bammera_pothanaకడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ.. నివేదిక రూపకల్పన చేస్తోంది.

కమలాక్షునర్చించు కరములు, కరములు. శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ అంటూ.. అలనాటి కవుల్లో తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు కవి బమ్మెర పోతన. మహా భాగవతం ద్వారా ప్రపంచ భక్తి పారాయణులకు తెలంగాణ ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించాడు. అలాంటి గొప్ప కవి, బమ్మెర పోతన స్వస్థలం అద్భుతమైన, విలక్షణమైన పర్యాటక, సాహిత్య కేంద్రంగా మారనుంది. అలాగే పాల్కుర్కి సోమనాథకవి నడయాడిన పాలకుర్తి సోమనాథ క్షేత్రాన్ని.. గొప్ప శైవక్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు. అటు వాల్మీకి నడిచిన నేలగా చరిత్రలో పేరు గడించిన వల్మిడిని కూడా అభివృద్ధి చేయనున్నారు. వరంగల్ జిల్లాలోని ఈ మూడు ప్రాంతాలను కలిపి.. పర్యాటక సాహిత్య సాంస్కృతిక కళా వికాస కేంద్రాల సర్క్యూట్ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైర్మన్ గా ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక తయారీ పనిలో నిమగ్నమైంది, కమిటీలో సాహితీ వేత్తలు, పండితులు, సాంస్కృతిక కళారంగ నిపుణులు, చరిత్ర పరిశోధకులు, పురాతత్వ నిపుణులు సభ్యులుగా ఉన్నారు.

బమ్మెరతోపాటు బసవపురాణం వంటి తొలి ద్విపద కావ్యాన్ని అందించి, సారస్వత చరిత్రలోనే గొప్ప కవిగా నిలిచిన పాల్కుర్కి సోమనాథకవి వైభవ చరిత్రనూ వర్తమాన సాహిత్య కళాభిమానులకు అందించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నివేదికల రూపకల్పన బాధ్యతలను ఐఐడీసీకి అప్పగించారు. ఇప్పటికే బమ్మెరలో మెస్సర్ ఇండుస్ టవర్ గ్రూప్ సంస్థ బమ్మెరలో పదెకరాల స్థలాన్ని సేకరించింది.

Collected :TNEWS

Leave a Comment