పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకే నష్టం!

దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అత్యున్నత గౌరవ ప్రదమైన ఉద్యోగార్థుల కోసం యూపీఎస్‌సీ ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యాసరూప ప్రశ్న జవాబులుండే ప్రధాన పరీక్ష మార్కులను ఇంటర్వ్యూ మార్కులను కలిపి చివరి ఎంపిక ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షలో ఒక ఎస్సే, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, రెండు ఆప్షనల్‌ సబ్జెక్టు పేపర్లతో పాటు ఇంగ్లీషు ఒక భారతీయ భాషలో కూడా పరీక్ష ఉంటుంది. అయితే ఇంగ్లీషు, భారతీయ భాష పరీక్షలు పదవ తరగతి స్థాయి ఉండి కనీస మార్పులు పొందితే చాలు. వీటిని చివరి ఎంపికకు పరిగణించరు. కనీస మార్కులు సుమారుగా 30 శాతం ఉంటాయి. కానీ ప్రధానపరీక్ష రాసే వారిలో దాదాపు పదిశాతం మంది ఈ భాషా సంబంధిత పరీక్షల్లో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగేతర భాషను ఎంపిక చేసుకోవడం వలన మనవారు ఈ పరీక్షలో విఫలమయ్యే అవకాశం ఎక్కువ. మన తెలుగు రాష్ర్టాలకు సంబంధించి కార్పొరేట్‌ విద్య మాయాజాలం వలన పాఠశాల, కళాశాల స్థాయిలో మార్కుల యావతో తెలుగేతర భాషలను ఎంపిక చేసుకొని కనీస మార్కులు పొందలేక ఎందుకూ కొరగాకుండా పోతున్నారు. అదే తెలుగును ఎంపిక చేసుకొన్నట్లైతే మాతృభాష కనుక వివిధ పోటీ పరీక్షలకే కాకుండా మన రాష్ట్ర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఎంసెట్‌కు భాషలకు సంబంధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాబోయే సంవత్సరం నుంచి ఐఐటీ పరీక్షలకు సైతం ఇంటర్‌ మార్కులను పరిగణించబోవడం లేదు. అలాంటప్పుడు మాతృభాషను వదిలి ఇతర భాషలను ఎంపిక చేసుకొని తరువాత విచారించడమంటే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం’ లాంటిదే. ఇకనైనా ఆలోచించాలి.

– వై. ఆనందనాయుడు, ఏలూరు

 

Leave a Comment