పావులూరి మల్లన:
పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. పావులూరి మల్లన భీమకవికి సమకాలికుడు. ఇతను శివ్వన్న అను అతనికి కుమారుడు. భీమకవి సవతి తల్లులలో ఒకామెకి ఈ శివ్వన్న తోబుట్టువని మలయమారుత కవీంద్రునిచే రచించబడిన “నీతి శాస్త్రము”లో వ్రాయబడింది. పావులూరి మల్లన గణితశాస్త్రములో మిక్కిలి పండితుడు. “పావులూరి గణితము” అనే పేరుతో గణితశాస్త్రమున ఒక పుస్తకం రచించాడు. దీనిని సంస్కృతంలో మహా వీరాచార్యులు రచించిన “సార సంగ్రహ గణితం” కు తెలుగు అనువాదంగా చెపుతారు. బహుశా తెలుగులో ఇదే తోలి అనువాదం అవ్వవచ్చు . అలాగే తోలి గణితశాస్త్ర గ్రంధం కూడానూ. పావులూరు మల్లనకు రాజరాజనరేంద్రుడు నవఖండవాడ అనే గ్రామమును దానము చేశాడు. పిఠాపురములోని కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయాము నందు ఈ దానశాసనం లభించింది. ఈ దానశాసనమును భీమకవి రచించారు. ఈ శాసనం చివరిభాగమున “ఇతి వేములవాడ భీమకవి కృతమ్ “ అని ఉన్నది. ఇతడు గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యాలలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తున్నది.
ఇతనిదని చెప్పబడుతున్న ఒక పద్యం
శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చను రాజరాజభూ-పలకుచేత బీఠపురి పార్శ్వమున న్నవఖండవాడ యన్బ్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా-శీలుడ రాజపూజితుడ శివ్వన పుత్త్రుడ మల్లనాఖ్యుడన్
గోదావరి మండలంలో పావులూరు గ్రామానికి ఈ మల్లన్న కరణంగా ఉండేవాడట. ఇతడు మహావీరాచార్యులు రచించిన గణిత సార సంగ్రహాన్ని తెనిగించాడు. మూలం ఆ సంస్కృత గ్రంధం కావచ్చునుగాని లెక్కలన్నీ మల్లన్న స్వయంగా వేసుకొన్నవే. వ్యర్ధ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంధాన్ని ఇమడ్చడం ఇతని ప్రతిభకు సూచిక. ఇతని రచనలో కవిస్తుతి, పరిచయం వంటివి లేవు. ఇందులో ఒక పద్యం.
చెలికి షడంశమున్ బ్రియకు శేషము లోపలఁ పంచమాంశమున్బొలుపుగ దాని శేషమున బోదకు నాల్గవపాలునిచ్చి యందులఁ దన పాలు దాఁ గొనిపోయెఁ దొమ్మిది చేనలు రాజహంసమీనలిన మృణాళమెంత సుజనస్తుత మాకెఱుఁగంగఁ జెప్పవే
మల్లన్న వ్రాసిన ఈ క్రింది పద్యం వల్ల అప్పుడు జనం తర్క, వ్యాకరణ, గణిత, ఖగోళ, భూగోళ విషయాలలో ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది.
అర్కాది గ్రహ సంచర గ్రహణ కాలాన్వేషణోపాయమునన్దర్క వ్యాకరణాగమాది బహుశాస్త్రప్రోక్త నానార్ధ సంపర్కాది వ్వవహారమునన్ భువనరూపద్వీప విస్తారమున్దర్కింపగన్ గణిత ప్రవృత్తి వెలిగా దక్కొండెరింగించునే?
విజ్ఞాన శాస్త్ర పఠనానికి గణితం చాలా ముఖ్యమనే విషయం ఈ పద్యంలో తెలియజెప్పబడింది.
ఈయనను గురించి అనేక విశేషాలు క్రింది లింకులలో చూడండి.
http://telugunestam.blogspot.in/2009/07/blog-post_4874.html
http://shrivemulawadabheemakavi.blogspot.in/p/blog-page_1452.html
http://harikotagiri.blogspot.in/2011/06/blog-post_13.html
http://scienceintelugu.blogspot.in/2009/10/blog-post_12.html
https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A8