బాదరాయణ సంబంధం: మన జాతీయాలు

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి

 

కొందరు బీరకాయపీచు బంధుత్వాలతో చుట్టాలుగా చలామణీ అవుతారు. కొందరికి ఆ ‘బీరకాయపీచు బంధుత్వం’ కూడా అక్కర్లేదు. మాటలతోనే చుట్టాలవుతారు. వెనకటికి ఒక వ్యక్తి ఒక ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ ఒక ఊళ్లో ఒక ఇంటి ముందు ఆగాడట. ఆ ఇంటాయనను పిలిచి ‘అంతా కులాసేనా? పిల్లలందరూ బాగున్నారా?’ అని అడిగాడట. బండిలో వచ్చిన వ్యక్తి చుట్టం కాబోలు అనుకొని ఇంటాయన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేశాడట.

బండి వ్యక్తి వెళ్లిపోయే ముందు… ఇంటాయన ఆతృత ఆపుకోలేక ఇలా అడిగాడట… ‘అయ్యా… నేను ఎంత ప్రయత్నించినా నాకు మీరు ఏ వైపు చుట్టమో గుర్తు రావడం లేదు’. దీనికి బండిలో వచ్చిన వ్యక్తి ఇచ్చిన సమాధానం ఇది… ‘మీ ఇంటి ముందు బదరీ చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు కూడా బదరీ చెక్కతో తయారు చేసినవే. ఇదే బాదరాయణ సంబంధం’.

Leave a Comment