తెలంగాణ, ఆంధ్రప్రదేశ్… రాష్ట్రాలుగా విడిపోవచ్చుగానీ తెలుగువారిగా ఇరు రాష్ట్రాల ప్రజలూ ఐకమత్యంతో ఉంటున్నారన్నది వాస్తవం. ఉద్యమం ముగిసిన తరువాత, తెలంగాణ ఏర్పడ్డ తరువాత ముందెన్నడూ లేని ఒక సుహృద్భావ వాతావరణం ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య నెలకొంది అనేది వాస్తవం. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు. ఢిల్లీలో తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, అవి ఒక సెల్ ఫోన్లో రెండు సిమ్ కార్డుల వంటివి అని వ్యాఖ్యానించారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడగొడుతూ పార్లమెంటులో చట్టం చేశారనీ, కానీ… తెలుగు భాషను రెండుగా విడగొడుతూ ఎవ్వరూ చట్టం చేయలేరని ఆయన అన్నారు. తెలుగువాడి సత్తా ఏంటో ఈరోజు ప్రపంచదేశాలకు తెలుసు అని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో తెలుగువారే జెండా ఎగరేస్తున్నారనీ, తెలుగు భాష అనేది ఒక పెద్ద సాఫ్ట్ వేర్ అనీ కొనియాడారు. తెలుగువారందరూ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలనీ… ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయమైన తెలుగుజాతిగా గుర్తింపు సాధించాలనీ, మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలనీ ఆయన వ్యాఖ్యానించారు. తెలుగువారి గురించి చెన్నమనేని చెప్పిన మాటలు చాలా బాగున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
సోర్స్ : http://www.t7am.com/news/post/two-states-are-two-sim-cards