వాతాపి జీర్ణం: మన జాతీయాలు

భోజనం చేశాక మన పెద్దలు వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అంటూ పొట్టమీద చేతితో నిమురుకుంటారు. దీనికి నేపథ్యంగా మహాభారతంలో ఒక కథ ఉంది. వాతాపి, ఇల్వలుడూ ఇద్దరు అన్నదమ్ములు, వీళ్లు రాక్షస రాజులు. ఒకరోజు ఇల్వలుడు తాను కోరుకున్నది జరిగే వరం ఇవ్వమని ఒక మునిని అడుగుతాడు. అలాంటి వరం ఇవ్వడం కుదరదని ఆ ముని చెప్పగానే ఆగ్రహించిన ఇల్వలుడు… రుషి హత్యలు మొదలుపెడతాడు. తమ్ముడు వాతాపిని ఆహారంగా చేసి… మునులను, బాటసారులను విందుకు పిలిచి భోజనం పెడతాడు. విందు ఆరగించాక … ‘వాతాపీ! బయటకు రా..’ అని పిలవగానే… అతడు వాళ్ల పొట్ట చీల్చుకుంటూ బయటకు వస్తాడు.

ఇలా మునులను, బాటసారులను చంపుతూ రాక్షసానందం పొందుతుంటారు ఇల్వలుడూ, వాతాపి. ఒకరోజు అగస్త్య మునిని విందుకు పిలుస్తారు. వాతాపిని ఆహారంగా మార్చి భోజనం పెడతాడు ఇల్వలుడు. మహా ముని అయిన అగస్త్యుడు సుష్టుగా భోంచేసి… తన మంత్ర శక్తితో పొట్ట లోపల వాతాపిని జీర్ణం చేసేస్తాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాడు. ఇలాంటి నీచ కార్యాలు మానుకోమని ఇల్వలుడికి బుద్ధి చెప్తాడు అగస్త్యుడు. ఇది ఇతిహాస కథ. అయితే, నిత్యజీవితంలో మాత్రం సందర్భాన్ని బట్టి ‘జీర్ణం చేసుకున్నాడు’ అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు.

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి

Leave a Comment