తెలుగు భాషను, ఆధ్యాత్మికతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం కృషి చేస్తున్న మహానుభావులను సన్మానించే కార్యక్రమానికి తాను ముఖ్యఅతిథిగా రావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ అన్నారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని టివోలీ గార్డెన్లో శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగుజాతి సంస్కృతి, నాగరికత, ఔన్నత్యాన్ని తెలియజేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. భారతదేశం అంటేనే ధర్మానికి ప్రాకారమని, చలన చిత్ర మాధ్యమం ద్వారా నా వంతుగా ఇందుకోసం కృషి చేస్తున్నానన్నారు. ప్రఖ్యాత సహస్రవధాని మాడుగుల నాగఫణి శర్మ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, లలిత సంగీత గాయని వేదవతి ప్రభాకర్, ప్రముఖ రచయిత కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ సామల రమేష్‌బాబు తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి రామాయణంలోని పలు ఘట్టాలను తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాఘవేంద్రన్, అప్పారావు, భాస్కరరావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, రాధాకుమారి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
reference: http://www.eenadu.net/district/inner.aspx?dsname=Hyderabad&info=hyd-gen9