ఒంగోలులో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార సాంస్కృతిక శాఖ నిర్వహణలో మంగళవారం రాత్రి ప్రకాశం భవన్‌లో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా జాయింట్‌ కలెక్టర్‌-2 ప్రకాష్‌కుమార్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. నాటక రంగానికి వీరేశలింగం పంతులు చేసిన కృషి అనన్యమన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ప్రభుత్వం రంగస్థల కళాకారుల సంక్షేమానికి అనేక విధాలా చేయూత అందిస్తోందన్నారు. విశిష్ట అతిథులు డీఆర్వో నూర్‌బాషా ఖాసిం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు అరుణ తమ ప్రసంగాల్లో జిల్లాలో రంగస్థల కళాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వాటికి పరిష్కారాలను ప్రస్తావించారు. సమాచారశాఖ ఏడీ వెంకటేశ్వర ప్రసాద్‌ సభా సంచాలకులుగా వ్యవహరించారు. ఏపీఆర్వోలు రాజు, మల్లేశం సహాయకులుగా పాల్గొన్నారు.

పురస్కార గ్రహీతలకు అభినందనలు
* జాయింట్‌ కలెక్టర్‌-2, డీఆర్వో సీనియర్‌ రంగస్థల నటుడు యార్లగడ్డ బుచ్చయ్య చౌదరిని రాష్ట్ర స్థాయి నాటక రంగ పురస్కారం, రూ. 25వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.
* సీనియర్‌ కళాకారులు జంపాల వెంకయ్య, చిట్టా శివ ప్రసాద్‌, పూర్ణా సత్యం, షేక్‌ తిరుమలాబీని జిల్లా స్థాయి పురస్కార విభాగంలో ఒక్కొక్కరికి రూ.పది వేల నగదు, శాలువా, జ్ఞాపిక ప్రదానం చేశారు. మరో కళాకారిణి ఎం.రత్నకుమారి నగరంలో లేక హాజరుకాలేకపోయారు.భువనగిరి పురుషోత్తం వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం ప్రతినిధులు బేతంశెట్టి హరిబాబు, అంగలకుర్తి ప్రసాద్‌, నాగినేని ఆర్ట్‌ మెమోరియల్‌ ప్రతినిధి మిడసల మల్లికార్జునరావు, అభ్యుదయ కళాసమితి ప్రతినిధి గాండ్ల శ్రీనివాసరావు, వివిధ నాటక సమాజాల నిర్వాహకులు, పురస్కార గ్రహీతలను సత్కరించారు.

 

Source: Eenadu.net

Leave a Comment